e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News విశ్వ గోపురంపై మెరిసిన బతుకమ్మ

విశ్వ గోపురంపై మెరిసిన బతుకమ్మ

 • సీఎం కేసీఆర్‌ చిత్రపటంతో లేజర్‌ షో
 • తెలంగాణ జాగృతి వీడియోకు చోటు
 • నిర్వాహకులకు కవిత కృతజ్ఞతలు

తెలంగాణ కీర్తిపతాక విశ్వగోపురంపై రెపరెపలాడింది. పర్యాటక ప్రపంచానికి మకుటాయమానమైన బుర్జ్‌ ఖలీఫాను కాంతిపుంజమై ముద్దాడింది. తెలంగాణ ఉద్యమ కర్త, బంగారు భవిత ఆవిష్కర్త సీఎం కేసీఆర్‌ రేఖా వర్ణచిత్రం విశ్వనేత్రంపై వెలుగులీనింది. తెలంగాణ సంస్కృతి ప్రతీక బతుకమ్మ దివ్యరూపం కళలు కురిసింది. హిమశిఖర సమానమైన దుబాయి భవ్యసౌధం తెలంగాణ బోనాల దృశ్యమెత్తి మురిసింది. తెలంగాణ అజేయ స్ఫూర్తి గగనవీధులకు ఎగిసింది. శనివారం రాత్రి 9.45 గంటలకు తిరిగి 10.30 గంటలకు తెలంగాణ సాంస్కృతిక వైభవ దృశ్యమాలిక బుర్జ్‌ ఖలీఫా లేజర్‌షోలో ప్రదర్శితమైంది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 23 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య, పర్యాటక కేంద్రమైన దుబాయికి కలికితురాయి లాంటి బుర్జ్‌ ఖలీఫా భవనం తెలంగాణ పండుగ సంబుర వేదికైంది. తెలంగాణకే తలమానికమైన పూలపండుగ బతుకమ్మ ఖ్యాతి ఖం డాంతరాలు దాటింది. ఎడారి దేశంలో తంగేడువనం విరబూసింది. భారతావని యువ రాష్ట్రమైన తెలంగాణ కీర్తికాంతులను ప్రపంచ ప్రజల ముందు అద్భుత దృశ్యంగా ఆవిష్కరించింది. ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా భవనంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రపటం లేజర్‌ వెలుగుల్లో మెరిసిపోయింది. సీఎం కేసీఆర్‌ ఫొటోతోపాటు బతుకమ్మ, బోనాల చిత్రాలు కూడా మిరుమిట్లు గొల్పాయి. బతుకమ్మ చిత్రం పదర్శిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత చిత్రం కూడా కనిపించింది. ఈ అద్భుత దృశ్యాన్ని విశ్వనేత్రం విప్పార్చి చూసింది. బుర్జ్‌ ఖలీఫాపై ప్రత్యేకంగా వ్యక్తుల ఫొటోలను లేజర్‌షోలో ప్రదర్శించటం అత్యంత అరుదు. ఇప్పటివరకు మహాత్మాగాంధీ, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ చిత్రాలను మాత్రమే ప్రదర్శించారు. ఆ ఘనత సాధించిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని టీఆర్‌ఎస్‌ స్థాపనతో ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయిన ఈ సందర్భంలో బుర్జ్‌ ఖలీఫాపై తెలంగాణ అస్తిత్వాన్ని ప్రదర్శింపజేయడం ద్వారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అపూర్వమైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

మూడు నిమిషాలపాటు సగర్వ ప్రదర్శన
తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై సగర్వంగా ప్రదర్శించారు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శనివారం సాయంత్రం బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బుర్జ్‌ ఖలీఫా తెరపై రెండుసార్లు ప్రదర్శించారు. మూడేసి నిమిషాల నిడివి గల ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం బుర్జ్‌ ఖలీఫా స్క్రీన్‌ పై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్‌ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన ప్రవాస తెలంగాణ వాసులు పులకించిపోయారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన లక్షల మంది పర్యాటకులు మన బతుకమ్మను ఎంతో ఆసక్తిగా తిలకించారు. బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం మన రాష్ర్టానికే గాక, దేశానికి సైతం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్‌, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్‌, డాక్టర్‌ సంజయ్‌, బిగాల గణేశ్‌గుప్తా, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్‌ సాగర్‌, విజయ్‌భాస్కర్‌, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

బుర్జ్‌ ఖలీఫాపై పూల కోలాటం..!

ఎడారి దేశంలో తెలంగాణ పూలవాన బుర్జ్‌ ఖలీఫా…830 మీటర్ల (2370 అడుగుల) ఎత్తుతో ఆకాశపు అంచును అందుకొనే అదొక ఆకాశ హార్మ్యం ప్రపంచంలోనే అతి ఎత్తైన మానవ నిర్మిత సౌధం.. అక్కడ.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ.. ఒక్కేసి అడుగేసి ఖలీఫా మామ నీ శిరస్సు అంచు చేరిన చందమామ..అంటూ తెలంగాణగుండె ఆవిష్కృతమైన అపురూప సన్నివేశం.. చూడ రెండు కండ్లుచాలవు కానీ తెలంగాణ గల్లా ఎగరేసింది గిదిరా తెలంగాణ అని రుచి చూపింది ఎంత సంబురం…గుండె ఉప్పొంగే సందర్భం.. గునుగు..తంగేడు.. సీతజడ..కట్ల.. బీర..గుమ్మడి..బంతి.మందార..అల్లి..తామర.. బుర్జ్‌ ఖలీఫాపై పూల కోలాటం.. తెలంగాణ పదమే నిషేధమైన కాలం నుంచి నింగి అంచుల దాకా నిలిచి గెలిచిన తీరు నింగిని ముద్దాడిన పూల స్పర్శ తెలంగాణ ఎగరేసిన జయపతాక..జాగృతమైన కీర్తిగీతిక బతుకమ్మకు వందనం

లేజర్‌ షో ఇలా సాగింది

 • లేజర్‌ షో ప్రారంభం కాగానే తొలుత బుర్జ్‌ ఖలీఫాపై ఎనిమిది రంగుల్లో బతుకమ్మను ఆవిష్కరించారు. బతుకమ్మ చిత్రంతో బుర్జ్‌ ఖలీఫా మొత్తం రంగులమయమైంది.
 • ఆ తర్వాత మూడు భాషల్లో బతుకమ్మ పేరును ప్రదర్శించారు. ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌ బతుకమ్మ’ అని ప్రదర్శించి ఆ తర్వాత ఇంగ్లిష్‌, తెలుగు, అరబ్బీలో బతుకమ్మ పేరును ప్రదర్శించారు. అనంతరం
 • తెలంగాణ రాష్ట్ర చిత్రం ఆవిష్కృతమైంది.
 • ఆ వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. జై జై తెలంగాణ నినాదాలను తెలుగు, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో ప్రదర్శించారు.
 • ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ జాగృతి పేరును, జ్యోతిని ప్రదర్శించారు.
 • లేజర్‌ షో జరుగుతున్నప్పుడు ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ‘అల్లీపూల’ బతుకమ్మ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది.
 • లేజర్‌ షో జరుగుతున్నంతసేపు బుర్జ్‌
 • ఖలీఫా చుట్టుపక్కల జై తెలంగాణ నినాదాలు, కేరింతలు, చప్పట్లతో పండుగ వాతావరణ నెలకొన్నది.

దేశానికే గర్వకారణం
బూర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మ లేజర్‌ షో మన రాష్ర్టానికే కాకుండా దేశానికే గర్వకారణం. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఇందుకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బూర్జ్‌ ఖలీఫా యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– ఎమ్మెల్సీ కవిత

ప్రదర్శన చరిత్రాత్మకం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌ బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం చరిత్రాత్మకం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కృషితో బతుకమ్మ ఎప్పుడో విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ కార్యక్రమంతో మన సాంస్కృతిక వైభవం మరింత వెలిగింది.

 • నందిని అబ్బగౌని, తెలంగాణ జాగృతి ఖతర్‌ అధ్యక్షురాలు

దశదిశలా తెలంగాణ కీర్తి
తెలంగాణ సంప్రదాయాన్ని బతుకమ్మ ప్రపంచం నలుదిశలా చాటుతున్నది. అన్నింటిలో తలమానికంగా బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శన తెలంగాణ సంస్కృతి విశిష్టతను చాటింది.
-మహేశ్‌ బిగాల, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement