మనిషికి అత్యంత ముఖ్యమైన అవసరాలేంటి? కూడు, గూడు, గుడ్డ! తెలంగాణ ప్రభుత్వం ఈ మూడింటికి మరొకటి కలిపింది. అదే వైద్యం. రాష్ట్రప్రజలందరికీ ప్రపంచస్థాయి వైద్యసదుపాయాల ఏర్పాటుకు నిధుల వరద పారిస్తున్నది. ఇది ఎవరో అనామకులు చెప్పిన గప్పాలు కాదు.. సాక్షాత్తూ కేంద్రం పార్లమెంటులో చెప్పిన లెక్కలు. దేశంలో ఒక్కో పౌరుడిపై ఆరోగ్యం కోసం అత్యధికంగా నిధులు ఖర్చుచేస్తున్న రాష్ర్టాల్లో హిమాచల్‌ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణే టాప్‌లో నిలిచింది. ముందు రెండు రాష్ర్టాలు చిన్నవి.. జనాభా తక్కువ. ఈ లెక్కన ప్రజలకు అత్యంత నాణ్యమైన వైద్యం అందిస్తున్న పెద్ద రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. ఈ జాబితాలో బీజేపీ పాలిత రాష్ర్టాలు అట్టడుగున ఉన్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఒక సమాజం ఉన్నతంగా ఎదగాలంటే ప్రతి వ్యక్తికి చేతినిండా పనితోపాటు అత్యుత్తమ వైద్య సౌకర్యాలుండాలి. ఇప్పుడు ధనిక దేశాలుగా ఎదిగిన ఏ దేశంలో అయినా ఇదే సూత్రం కనిపిస్తుంది. అదే సూత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లో పెట్టింది. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్లలోనే వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను సమాంతరంగా అభివృద్ధిచేసి ప్రజలకు చేతినిండా పని కల్పించింది. నిరుపేద కూడా సగౌరవంగా జీవించటానికి డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇస్తున్నది.
కష్టించి పనిచేసే సగటు జీవికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించేందుకు ఇప్పుడు మెడికల్ మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల వరద పారిస్తున్నది. వైద్యారోగ్యంపై అత్యధిక తలసరి వ్యయం చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో ఇటీవల ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లెక్కలతోసహా సమాధానమిచ్చింది. తలసరి ఆరోగ్య వ్యయంలో హిమాచల్‌ప్రదేశ్ రూ.3,177తో అగ్రస్థానంలో ఉండగా, కేరళ రూ.2,272 రెండోస్థానంలో, తెలంగాణ రూ.1,698తో మూడోస్థానంలో ఉన్నాయని వెల్లడించింది. నేషనల్ హెల్త్ అకౌంటస్ స్టేట్మెంట్ 2017-18 ప్రకారం తలసరి ఆరోగ్య వ్యయంలో బీహార్ (రూ.556), జార్ఖండ్ (రూ.801), మధ్యప్రదేశ్ (రూ.980) అట్టడుగున ఉన్నాయి.
వచ్చే రెండేండ్లలో పదివేల కోట్లు
రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్తు, వ్యవసాయం వంటి సమస్యలు తీరడంతో ఇక విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. వచ్చే రెండేండ్లలో వైద్యంపై అదనంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. దీంతో రానున్న కాలంలో తెలంగాణ తలసరి ఆరోగ్య వ్యయం మరింత పెరిగి దేశంలోనే మొదటి స్థానంలోకి చేరుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పట్టణాల్లో బస్తీ దవాఖానలు, గ్రామాల్లో పల్లె దవాఖానలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, వరంగల్‌లో హెల్త్ సిటీ, హైదరాబాద్ నలువైపులా నాలుగు దవాఖానలు, ఉచిత రోగనిర్ధారణ పరీక్షలకోసం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లతో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ హెల్త్ హబ్‌గా మారుతున్నది.
మొదట ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రపంచస్థాయి వైద్య మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించింది. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నది. రెండేండ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తెలంగాణ అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న మూడంచెల ప్రజారోగ్య వ్యవస్థను, కరోనా అనుభవాలతో సీఎం కేసీఆర్ ఐదంచెల వ్యవస్థగా మార్చాలని ప్రతిపాదించారు. అందుకోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి.
తలసరి ఆరోగ్య వ్యయం
హిమాచల్‌ప్రదేశ్ : 3,177
కేరళ : 2,272
తెలంగాణ : 1,698