కోల్‌కతా, నవంబర్ 22: కేంద్రంలోని మోదీ సర్కారు చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన బాట పట్టింది. ఈ నెలాఖర్లో ఢిల్లీలో నిరసనకు దిగుతామని ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా సోమవారం తెలిపారు. ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వీలున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం నుంచి ‘భారత్ యాత్ర’ పేరుతో నిరసనల్ని మొదలు పెడుతామని, 29న జంతర్ మంతర్ వద్ద ఈ యాత్ర ముగింపు నిరసనల్ని పెద్ద ఎత్తున చేపడుతామని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ బ్యాంకుల్ని ఒకదానిలో మరికొన్నింటిని విలీనం చేసిన కేంద్రం.. వాటిలో పెట్టుబడులను క్రమేణా ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా మెజారిటీ బ్యాంకులను ప్రైవేట్‌పరం చేయాలనుకుంటున్నది.
రాజకీయ లబ్ధి కోసమే..
బ్యాంకుల ప్రైవేటీకరణను ఆర్థిక సంస్కరణల్లో భాగంగా చేస్తున్నామని కేంద్రం చెప్తున్నదని, కానీ అదంతా అసత్యమని దత్తా మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం ఈ పని చేస్తున్నదని ఆరోపించారు. బడా కార్పొరేట్లకు బ్యాంకుల్ని కట్టబెట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు లక్ష్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రాధాన్య రంగాలు దెబ్బ తింటాయని, స్వయం సహాయక బృందాలకు రుణాలు అందబోవన్నారు. దేశంలోని డిపాజిట్లలో దాదాపు 70 శాతం ప్రభుత్వ బ్యాంకుల్లోనే ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సామాన్యుల సొమ్మును పెట్టుబడిదారుల చేతికి అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రైవేటీకరణకు దిగుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ బ్యాంకుల అమ్మకాన్ని ఆర్థిక వ్యవస్థలో అందర్నీ భాగస్వాములను చేయడం కాదని, దూరం చేయడమని అభివర్ణించారు.