Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్‌ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి గోపాల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ అండదండలతోనే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు నియోజకవర్గంలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు.

Balka Suman1
బాధితుడు గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, అనుచరుల వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని ఆరోపిస్తూ గత వారం నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హైవే రోడ్డుపై గోపాల్‌ను అడ్డగించి గుంపులుగా చేరుకున్న కొంతమంది తీవ్రంగా దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే గోపాల్‌ను కొట్టారని స్థానికులు చెబుతున్నారు.
అంతకుముందు ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణ కార్యక్రమం పేరుతో మందు, విందు ఏర్పాటు చేసి, అక్కడే గోపాల్‌పై దాడికి పథకం రచించినట్లు బాధితుడు ఆరోపించాడు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఉస్కమల్ల పున్నం చందు అనుచరులు, కాంగ్రెస్ నాయకుడు ఆవుల సురేష్ యాదవ్‌తో పాటు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన గోపాల్‌ను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.