Chennur Voter List | చెన్నూరు బల్దియాలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమైంది. తొలి జాబితాలోని పొరపాట్లను సరిచేసి ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగల తొక్కి తప్పుల తడకలతో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒక్కో ఓటరు పేరు రెండు నుంచి మూడు వార్డుల్లో ఉండగా.. గతేడాది మృతి చెందిన మృతుల సంఖ్య సైతం జాబితాలో ఉన్నాయి.
చెన్నూర్ మున్సిపాలిటీలో మొత్తం 19,903 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 400లకు పైగా మృతులకు ఓట్లు ఉన్నాయి. వార్డుకు 900 నుంచి వెయ్యి మంది ఓటర్లు ఉండగా.. 25 నుంచి 30 వరకు మృతులకు ఓట్లు ఉండటం గమనార్హం. వార్డుల వారీగా ఓటరు జాబితాలను పరిశీలించిన రాజకీయ పార్టీల నాయకులు అధికారుల తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ ద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుండగా.. ఏడాదిలో ఎంతమంది మృతిచెందారనే జాబితా అధికారుల ఉంటుందని.. దాని ప్రకారం మృతుల ఓట్లను తొలగించడం లేదని మండిపడుతున్నారు. ఆత్మల పేర్లను ఓటర్ జాబితాలో పొందపరచడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కూడా విమర్శలు గుప్పించారు. చెన్నూరు అధికారులు గొప్ప మనసు చాటుకున్నారని.. సచ్చినోళ్లకు ఓటు హక్కు కల్పించిన పుణ్యాత్ములు అని సెటైర్లు వేశారు. అవసరమైతే ఆత్మలకు టికెట్ ఇవ్వాలని ఈ మహాత్ములు కోరుతారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ పాలనలో ఇవన్నీ కామనే అని సామాన్యులు అంటున్నారని తెలిపారు.