బడంగ్‌పేట : ప్రతి ఏడాది వేలంపాటలో ప్రత్యేకతను సంతరించుకుంటున్న బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది కూడా రికార్డు స్థాయి ధరను సొంతం చేసుకుంది. ఈ ఏడాది నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆదివారం ఉదయం బాలాపూర్ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా పుర వీధుల గుండా గ్రామ ప్రధాన కూడలి బొడ్రాయి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడే వేలం పాట నిర్వహించారు.
లడ్డూ వేలం పాటలో 30 మంది పాల్గొన్నారు. వారిలో 27 మంది స్థానికులు కాగా ముగ్గురు మాత్రమే బయటి వ్యక్తులు. ఉత్సవ సమితి లడ్డూ వేలం పాటను రూ. 1116తో ప్రారంభించారు. పాట ముగిసే సమయానికి అబాకస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు, నాదర్గుల్కు చెందిన మర్రి శంశాక్ రెడ్డి , పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు కలిసి రూ.18,90లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. కాగా 2019లో రూ. 17.60లక్షలకు కొలన్ రాంరెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గతంతో పోలీస్తే ఈ ఏడాది రూ.1.30లక్షలు అధనంగా ధర పలికింది. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభం కాగా నాడు కొలన్ మోహన్ రెడ్డి రూ.450లకు దక్కించుకున్నారు. అలా రూ.450లతో మొదలైన లడ్డూ వేలం ఈ ఏడాదితో రూ.18.90లక్షలకు చేరుకుంది.
ప్రజలను చల్లాగా చూడాలి : మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి
కరోనా నుంచి ప్రజలను గణనాథుడే కాపాడాలని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆమె అన్నారు. ప్రజలను కష్టాల నుంచి కాపాడాలన్నారు .బాలాపూర్ లడ్డూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందన్నారు.
ఏపీ సీఎం జగన్‌కు లడ్డు : రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి
బాలాపూర్ లడ్డూ దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, శశాంక్ రెడ్డి తెలిపారు. కాగా వేలంలో తాము దక్కించుకున్న లడ్డూను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్‌పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, స్థానిక కార్పొరేటర్స్ వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బండారి మనోహర్, ఎర మహేశ్వరి జైయింద్, స్థానిక నాయకులు కొలన్ శంకర్‌రెడ్డి, భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు రాఘవరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.