డిచ్పల్లి, నవంబర్ 30: ఆర్టీసీ సేవలను తెలంగాణ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఉపయోగించుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ నుంచి నిజామాబాద్ వరకు ప్రత్యేక బస్సును వీసీ రవీందర్‌తో కలిసి ఆర్టీసీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి టీయూ ఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షించారు. వర్సిటీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బస్సు రాకపోకలు సాగుతాయని తెలిపారు. డిగ్రీ కళాశాలలో అధిక ఫీజుల వసూళ్లపై ఆర్టీసీ చైర్మన్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్‌ను టీయూ సిబ్బంది శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ విద్యావర్ధిని, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య, మండల అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు రాజశేఖర్, చాకలి సాయిలు, ఒడ్డె సా యిలు, విఠల్‌రాథోడ్, యూసుఫ్, నాందేవ్, అమీ ర్, ఒడ్డం నర్సయ్యతో పాటు నాయకులు, టీయూ ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.