బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో సంచలనం సృష్టించిన రూ. 122 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫైళ్ల మాయం వ్యవహారంలో ప్రస్తుతం ఒక ‘బిగ్’ డీల్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడి, ఆపై ఆధారాలు దొరకుండా ఫైళ్లను మాయం చేసిన సదరు కాంట్రాక్టర్లు ఇప్పుడు అధికార బలంతో బిల్లులు క్లియర్ చేయించుకునేందుకు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్లు అంతా ఏకమై, ముఖ్యనేత సోదరుడిని ఆశ్రయించి పెద్ద ఎత్తున పైరవీలు నడుపుతున్నట్లు జీహెచ్ఎంసీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నిజాయితీగా పనిచేసిన చిన్న చితకా కాంట్రాక్టర్ల అర్హతను అడ్డం పెట్టుకుని, ఈ భారీ అక్రమాలకు పాల్పడిన పెద్ద తలకాయల ఫైళ్లను కూడా క్లియర్ చేసేందుకు మార్గం సుగమం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే బడంగ్‌పేట పెండింగ్ బిల్లుల జాబితాను శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం.
– సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ)
బడంగ్ పేటలో గతంలో జరిగిన రూ. 122 కోట్ల అక్రమాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన 10 మంది మున్సిపల్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అధికారులపై వేటు వేశారు. అసలు సూత్రధారులైన కాంట్రాక్టర్ల జోలికి మాత్రం విచారణాధికారులు వెళ్లకపోవడం, పైగా అదృశ్యమైన దాదాపు 80 కీలక ఫైళ్లు ఓ కాంట్రాక్టర్ బంధువు ఇంట్లో ప్రత్యక్షం కావడం, ఇప్పుడు ఆ ఫైళ్ల వెనుక ఉన్న అసలు తిమింగలాలను కాపాడే విధంగా సంబంధిత బిల్లులను క్లియర్ చేసేందుకు తెరవెనుక భారీ పైరవీలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
వాస్తవంగా మొత్తం 1,596 ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, అందులో సగానికి పైగా ఫైళ్లు రికార్డుల్లో మాయమాయ్యాయి. ఇప్పుడు ఆ అదృశ్యమైన ఫైళ్లకు సంబంధించిన బిల్లులను ఎలాగైనా క్లియర్ చేయించుకునేందుకు సదరు కాంట్రాక్టర్లు సర్వశక్తు లూ ఒడ్డుతున్నారు. రెండు విధాలుగా బిల్లులు పెం డింగ్ జాబితాలో పడ్డాయి. ఫిజికల్ వర్క్స్ విషయానికొస్తే టెండర్లలో పాల్గొని సీసీ రోడ్లు, నాలా ఇతర పనులు చేసిన కొందరు కాంట్రాక్టర్లు ఐతే..నాన్ ఫిజికల్ వర్క్స్ పారిశుధ్యం, జేసీబీల వినియోగం, మట్టి దిబ్బలు ఎత్తడం, ఇతర పనులకు సంబంధించిన వాటిల్లోనే ఎక్కువగా శాతం అక్రమాలు జరిగాయి.
ఫిజికల్ వర్క్స్‌కు సంబంధించి రికార్డులు స్పష్టంగా ఉంటాయి. కానీ నాన్ ఫిజికల్ వర్క్స్ సరైన ఆధారాలు లేకపోవడం, వీటికి సంబంధించి రూ. లక్ష చొ ప్పున దాదాపు 600 ఫైళ్లలో అక్రమాలను విజిలెన్స్ గుర్తించారు. లెక్క పత్రం లేకుండా ఇష్టానుసారంగా చెక్కుల రూపంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే ఈ అక్రమాల కాంట్రాక్టర్ల జాబితాలో అర్హులైన చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆగిపోయాయి. వీరి ముగుసులో అక్రమార్కులు పైరవీల బాట పట్టారు. పెండింగ్ ఫైళ్లను ఒకేసారి క్లియర్ చేసి, అక్రమంగా క్లెయిమ్ చేసిన కోట్లాది రూపాయలను దండుకునేందుకు లైన్ క్లియర్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
రూ. 122 కోట్ల అక్రమాల వ్యవహారంపై గతంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి, ప్రాథమిక ఆధారాల మేరకు ఇప్పటికే 10 మంది అధికారులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అధికారులపై వేటు వేయగా.. ఈ మొత్తం అక్రమాల్లో కీలక సూత్రధారులు, పాత్రధారులైన కాంట్రాక్టర్ల జోలికి మాత్రం విచారణాధికారులు వెళ్లకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్ల వెనుక ఉన్న రాజకీయ అండదండల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కనీసం అదృశ్యమైన ఫైళ్లు కాంట్రాక్టర్ ఇంట్లో దొరికినా చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ విచారణ పూర్తి చేశాకనే బిల్లులు మంజూరు చేయడంతో పాటు బాధ్యులైన కాంట్రాక్టర్ల నుంచి అప్పటికే చెల్లింపులు జరిపిన వాటిని రికవరీ చేయాలి.. కానీ రాజకీయ ఒత్తిళ్లు తీవ్రస్థాయికి చేరడంతో పెండింగ్ బిల్లుల ఫైల్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాల కమిషనర్ టేబుల్ పైకి చేరింది. పైస్థాయి నుంచి వస్తున్న ‘సిఫార్సుల’కు తలొగ్గి అక్రమ బిల్లులకు పచ్చజెండా ఊపుతారా? లేక సమగ్ర విచారణ జరిపి అవినీతి తిమింగలాల ఆట కట్టిస్తారా? ఈ ‘బిగ్ డీల్’పై జీహెచ్ఎంసీ కమిషనర్ తీసుకోబోయే తుది నిర్ణయంపైనే సర్వత్రా ఉతంఠ నెలకొంది.
అధికారులు మాత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో ప్రత్యేక ఫార్మట్ ఇచ్చారని, టెండర్ ఐడీ, డేటా, పనులు వివరాలు, ఏ స్టేజీలో ఎంత చేశారు? ఇలా దాదాపు 18 కాలమ్స్‌తో కూడిన వివరాలను పూర్తిగా తీసుకుని బిల్లులు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బిల్లుల చెల్లింపుల ప్రతిపాదనలు చేరిన తరుణంలో గుట్టు చప్పుడు కాకుండా పారదర్శకంగా పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయా? లేదా ? అన్నది చూడాల్సి ఉంది.