హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్రమైన ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఏపీలోని కాకినాడ, కడప, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నట్టు స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. కొవిడ్‌తో ఇప్పటికే నలుగురు మృతిచెందారు. మృతిచెందినవారు ఇదివరకే పలురకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపి ఉండవచ్చని అక్కడి అధికారులు చెప్తున్నారు. స్థానికంగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అప్రమత్తమైన ఏపీ సర్కార్ ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, నియమాలు పాటించాలని సూచించింది. ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. అనుమానిత లక్షణాలున్న రోగులకు పరీక్షలు జరుపడం, ఐసోలేషన్‌లో ఉంచడం వంటి చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. జూన్ 26 నుంచి జూలై 15 వరకు ఏపీలో మొత్తం 67 కరోనా కేసులు నమోదైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. గడిచిన 15 రోజుల్లో దేశ వ్యాప్తంగా 399 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, దేశంలోనే అత్యధికంగా కేరళలో 115కరోనా కే సులు నమోదైనట్టు సమాచారం. ని త్యం తెలంగాణకు రాకపోకలు సాగించే ఏపీలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కనీసం ప్రజలను అప్రమత్తం చేయాలనే సోయి తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖకు లేకపోవడం విడ్డూరం.