కీవ్, ఫిబ్రవరి 26: తమ కన్నా వందల రెట్లు పెద్దదైన దేశం ఆక్రమణకు వచ్చింది. శత్రుమూకలు ఎంతో శక్తిమంతమైనవి. వాళ్ల సైనిక బలం ఎక్కువ. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గొప్పది. అయినా.. ధైర్యమే అస్త్రంగా.. దేశాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యమే శస్త్రంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పోరాడుతున్నారు. తమ సైన్యంలో, ప్రజల్లో ఎప్పటికప్పుడు స్ఫూర్తిని రగిలిస్తున్నారు. రష్యా దాడులను చూసి ఏకంగా అమెరికానే.. ‘మిమ్మల్ని భద్రంగా దేశం నుంచి తరలిస్తాం. వచ్చేస్తారా జెలెన్స్కీ’ అని అడిగిండి. అమెరికా అందించిన సాయాన్ని ఆయన తృణప్రాయంగా తిరస్కరించారు. ‘యుద్ధం నా దేశం మీద జరుగుతున్నది. నేను పారిపోవడం కాదు. నాకు మరిన్ని ఆయుధాలు కావాలి’ అని వీరత్వాన్ని చాటుకొన్నారు. విజయమైనా.. వీరమరణమైనా నేను పుట్టిన గడ్డమీదే అని స్పష్టం చేశారు. దేశం కోసం నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘మన ధైర్యమే మన, ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయిస్తుంద’ని పేర్కొన్నారు. ఆయుధాలను వదిలి లొంగిపోవాలని తాను చెప్పినట్టు వస్తున్న వదంతులను జెలెన్స్కీ ఖండించారు. రష్యాకు లొంగిపోబోమని చెప్పారు. ఆయుధాలను వదిలేదే లేదన్నారు.