కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలో శనివారం ఐకేపీ ఆధ్వర్యంలో గుప్పెడు పప్పు (Guppedu Pappu) కార్యక్రమంపై స్వయం సహాయక గ్రామ సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ‘ మహిళలు, పోషకాహారం లోపించిన పిల్లలు, మధ్యస్థ పోషకాహారం లోపించిన పిల్లలు’ అనే అంశంపై మండల ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్ అవగాహన కల్పించారు.
6 నెలల నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి సరైన ఎదుగుదల లేక పౌష్టిక ఆహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను స్వయం సహాయక సంఘాలు దత్తత తీసుకుంటున్నాయని, తమకు తోచినంత గుప్పెడు పప్పు, బియ్యం, పాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ఇతర పౌష్టిక ఆహార పదార్థాలను సేకరించి గ్రామ సంఘాలకు అప్పగించాలని సూచించారు. వాటిని ప్రతి నెల గ్రామ సంఘాల సమావేశంలో చిన్నారుల తల్లిదండ్రులకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు, వీవోఏలు, స్వయం సహాయక సంఘాల గ్రూప్ మహిళా సభ్యులు పాల్గొన్నారు.