వెల్లింగ్టన్: ఓటమెరుగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న ఆస్ట్రేలియా మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచకప్ నెగ్గేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వర్షం అంతరాయం మధ్య బుధవారం జరిగిన తొలి సెమీస్‌లో ఆసీస్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత అలీస్సా హిలీ(107 బంతుల్లో 129, 17 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీకి తోడు రాచెల్ హేన్స్(85) రాణింపుతో ఆసీస్ 45 ఓవర్లలో 305/3 భారీ స్కోరు నమోదు చేసింది.
పసలేని విండీస్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ హిలీ పరుగుల వరద పారించింది. మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించిన ఈ వికెట్‌కీపర్, బ్యాటర్ తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లతో ఆకట్టుకుంది. విండీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ హిలీ, హేన్స్ కలిసి తొలి వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఆఖర్లో బేత్ మూనీ(43) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆసీస్ మూడు వందల మార్క్ అందుకుంది. హెన్రీ(2/51) రెండు వికెట్లు తీసింది.
లక్ష్యఛేదనకు దిగిన విండీస్..37 ఓవర్లలో 148 పరుగులకు కుప్పకూలింది. కంగారూ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో విండీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ స్టెఫానీ టేలర్(48) మినహా అందరూ విఫలమయ్యారు. జోనాసెన్(2/14) రెండు వికెట్లతో ఆకట్టుకుంది. సెంచరీతో విజృంభించిన హిలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. గురువారం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ జరుగనుంది.