అబుదాబి: పొట్టి ఫార్మాట్లో తొలిసారి ప్రపంచ కప్ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టగా.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. శనివారం సూపర్-12 గ్రూప్-1 పోరులో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మార్క్మ్ (40) టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హజిల్‌వుడ్, జంపా, స్టార్క్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో కంగారూలు కాస్త తడబడ్డా.. చివరికి 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పో యి 121 పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ (35), స్టొయినిస్ (24 నాటౌట్) రాణించారు.
విశ్వవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌ల్లో స్టార్లుగా గుర్తింపు సాధించిన విండీస్ ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కరీబియన్లు తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడారు. శనివారం జరిగిన రెండో పోరులో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విండీస్‌పై గెలిచింది. ఆదిల్ రషీద్ (4/2), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మోయిన్ అలీ (2/17) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. క్రిస్ గేల్ (13) టాప్ స్కోరర్. గేల్ మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో విండీస్ కుప్పకూలింది. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. బట్లర్ (24) అజేయంగా నిలువగా.. విండీస్ బౌలర్లలో అకేల్ హుసేన్ కండ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు.