సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్ లే అవుట్లోని ప్లాట్లు అ‘ధర’హో అనిపించాయి. రెండు రోజుల్లో హెచ్ఎండీఏకు రూ.474.61 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 44 ప్లాట్లను ఆన్లైన్లో విక్రయానికి ఉంచగా, 39 స్థలాలను కొనుగోలు చేశారు. మొదటి రోజు 23 ప్లాట్లకు రూ.141.61 కోట్ల ఆదాయం రాగా, రెండో రోజు 16 వాటికి రూ.333,00,14,000 రాబడి వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
అమ్మకానికి 44 ప్లాట్లు..
మొత్తం అమ్మకానికి ఉంచిన 44 ప్లాట్లలో 39 అమ్ముడుపోగా ఐదు మిగిలిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,35,408 గజాల స్థలంలో 85 వేల గజాలు సరాసరిన గజానికి రూ.56వేలు ధర పలికిందని, గతంలో ఉప్పల్ భగాయత్ లే అవుట్లో మొదటి సారి వేసిన వేలం పాటలో సరాసరిన రూ.51వేలు, రెండో సారి వేలంలో రూ.53వేలు, తాజాగా మూడోసారి వేసిన వేలంలో రూ.56 వేలు గజానికి వచ్చిందని వివరించారు. మిగిలిన 50వేల గజాలను మరోసారి విక్రయిస్తామని, తాము అనుకున్నట్లుగానే ఆన్లైన్ వేలం విజయవంతంగా ముగిసిందని చెప్పారు.
భారీ ప్లాట్ల కొనుగోలుకు..
తూర్పు దిక్కున ఉన్న ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో చిన్న, మధ్య స్థాయి ప్లాట్లతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేసేందుకు వీలుగా భారీ విస్తీర్ణంలో లేఅవుట్ను అభివృద్ధి చేశారు. 150 గజాల స్థలం మొదలు కొని.. 2వేల గజాల వరకు 24 ప్లాట్లు ఉండగా, 2వేల గజాల పైన మరో 20 ఉన్నాయి. వీటిలో కేవలం 4 ప్లాట్లే మిగిలిపోయాయి. ఈ ఆన్లైన్ వేలంలో చిన్న ప్లాట్లతో పెద్దవి కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపారని, మెరుగైన మౌలిక వసతులే కొనుగోలు దారులను ఆకర్షించాయని అధికారులు తెలిపారు.