మంచిర్యాల టౌన్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ ( SCR GM Sandeep Madhuru) సోమవారం మంచిర్యాల ( Mancherial ) రైల్వే స్టేషన్ను సందర్శించారు. అమృత పథకంలో భాగంగా రూ. 24 కోట్లతో మంచిర్యాల రైల్వే స్టేషన్ లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్ లోపల, బయట కలియతిరిగి అక్కడ జరుగుతున్న పనులు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat train ) నిలిపేందుకు పరిశీలిస్తున్నామన్నారు. దీంతోపాటు న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నంకు వెళ్లే ఏపీ ఎక్స్ప్రెస్ను ఆపాలని డిమాండ్ ఉన్న నేపథ్యంలో దానిని కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు.