గాంధీధామ్, అక్టోబర్ 29: గుడి లోపలికి వచ్చారన్న కారణంతో ఆరుగురు సభ్యులున్న ఓ దళిత కుటుంబంపై 20 మంది కలిసి విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. పైపులు, కర్రలు, పదునైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. అమానుషమైన ఈ ఘటన ప్రధాని మోదీ స్వరాష్ట్రం, బీజేపీ పాలిత గుజరాత్లోని కచ్ జిల్లా నేర్ గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది.
అసలేమైందంటే..
గోవింద్ వఘేలా ఓ దళితుడు. అతని తండ్రి జగబాయ్. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటే, గోవింద్ ఆటో నడుపుతూ ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవాడు. గ్రామంలోని రామాలయంలో ఈ నెల 20న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి గోవింద్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని కొందరు.. గోవింద్ కుటుంబంపై పగబట్టారు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాధితుడికి చెందిన పొలంలోకి పశువులను తోలారు. విషయం తెలియడంతో అక్కడికి వెళ్లిన గోవింద్, అతని తండ్రి, తల్లి, మరో ముగ్గురు కుటుంబసభ్యులపై దుండగులు.. కర్రలు, పైపులు, పదునైన ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారు. గోవింద్ ఆటోను ధ్వంసం చేయడంతోపాటు మొబైల్ ఫోన్ను లాక్కొన్నారు. బాధితులను స్థానికులు దవాఖానలో చేర్పించి చికిత్స అందించారు.
నిందితులపై హత్యాయత్నం కేసు
బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం, దోపిడీ, దొంగతనం, దాడి, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని జిల్లా డీఎస్పీ కిశోర్సిన్హా జాలా తెలిపారు. నిందితులను పట్టుకొనేందుకు 8 బృందాలను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు.