Himanta Biswa Sarma : అసోం రాజకీయాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అడుగుపడింది. ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన కేబినెట్ సహచరులతో కలిసి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (Laxman Prasad Acharya) ను కలిశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. అయితే నూతన ప్రభుత్వం కొలువుదీరేదాకా తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని గవర్నర్ ఆయనను కోరారు.
మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ కూటమి ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. రాజీనామా అనంతరం లోక్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన హిమాంత బిశ్వశర్మ, ఈ చారిత్రాత్మక విజయం తర్వాత కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 11 తర్వాత ఉంటుందని వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర పరిశీలకుల సమక్షంలో త్వరలోనే జరగబోయే బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని అధికారికంగా ఎంపిక చేయనున్నారు. అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుండటంతో అటు పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.