– నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, మే 06 : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నల్లగొండ కార్పొరేషన్‌కు మెరుగైన ర్యాంకు సాధనకు అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్ బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. ప్రజలకు ఫీడ్ బ్యాక్ ప్రాముఖ్యతను వివరించి, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2028, సిటిజన్ ఫీడ్ బ్యాక్, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని, ఇంజినీరింగ్ శాఖ ద్వారా కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
వేసవి కాలంలో నగరంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్ద ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా షేడ్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రాములు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జె.కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.అశోక్, అసిస్టెంట్ ఇంజినీర్ అసీమ్ బాబా, రెవెన్యూ ఆఫీసర్ జి. శివరామ్ రెడ్డి, వార్డు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనకు సమన్వయంతో పని చేయాలి’