చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ సభ్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. (TVK member arrested) టీవీకే సభ్యుడైన 45 ఏళ్ల దినేష్ అలియాస్ పాంబు దినేష్, చెన్నైలోని కాసిమేడు సింగారవేలన్ నగర్లో నివసిస్తున్నాడు. మైలాపూర్‌కు చెందిన పదేళ్ల బాలిక ఆ ప్రాంతంలోని బంధువుల ఇంటికి వచ్చింది. బయట ఆడుతున్న ఆమెను దినేష్ తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
కాగా, ఆ బాలిక తన బంధువైన మహిళకు ఈ విషయం చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం రాయపురం మహిళా పోలీస్ స్టేషన్‌కు ఆ కేసును బదిలీ చేశారు.
మరోవైపు నిందితుడైన దినేష్‌ను మే 4న అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆర్కే నగర్ నియోజకవర్గం టీవీకే అభ్యర్థికి మద్దతుగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అతడు ఉండటంతో అరెస్ట్ చేయలేకపోయారు.
కాగా, కౌంటింగ్ తర్వాత అదే రోజు రాత్రిన దినేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే పార్టీ సభ్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది.