జైపూర్ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ చీఫ్ సోనియా గాంధీతో బుధవారం గెహ్లోత్ భేటీ అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర చివరి బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే వరకూ గెహ్లోత్ సీఎంగా కొనసాగుతారని చెబుతున్నారు.
జోషితో చాలాకాలంగా గెహ్లోత్ సన్నిహితంగా ఉంటున్నా 2020 జూన్‌లో గెహ్లోత్ ప్రభుత్వాన్ని కాపాడటంలో జోషి సాయపడటంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. సచిన్ పైలట్ నేతృత్వంలో ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పైలట్ సహా 19 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు జోషి అనర్హత నోటీసు జారీ చేశారు.
ఇక పార్టీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరుగుతుందని, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నినాదం అమలవుతుందని గెహ్లోత్‌తో సోనియా స్పష్టం చేయడంతో రాజస్దాన్ సీఎంగా గెహ్లోత్ వైదొలగుతారని ప్రచారం ఊపందుకుంది. గెహ్లోత్ స్ధానంలో సచిన్ పైలట్ రాజస్ధాన్ సీఎం పగ్గాలు చేపడతారని వార్తలు రాగా తాజాగా సీపీ జోషీ పేరు తెరపైకి వచ్చింది.
రాజస్దాన్‌లోని రాజసమంద్ జిల్లా కున్వరియ జిల్లాలో జన్మించిన సీపీ జోషీ సైకాలజీలో డాక్టరేట్‌తో పాటు లా డిగ్రీ పొందారు. 1980లో తొలిసారిగా 29 ఏండ్ల వయసులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2008లో జోషీ రాజస్ధాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆపై రాష్ట్ర మంత్రిగా, యూపీఏ-2లో కేంద్ర కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.