ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించినట్లుగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్‌ను పాకిస్థాన్ నుంచి బంధించి తీసుకురావాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన వారిపై చర్యలు తీసుకోవడంలో భారత దేశం ఎందుకు విఫలమవుతున్నదని ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “ట్రంప్ దళాలు మదురోను నిర్బంధించి ఆయన దేశం నుంచి అమెరికాకు తీసుకెళ్లినట్లు మనం వింటున్నాం.
మదురోను తన సొంత దేశం నుంచి ట్రంప్ అపహరించగలిగినపుడు, మీరు (మోదీ) కూడా పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు, 26/11 ఉగ్రదాడుల సూత్రధారిని భారత్‌కు తీసుకురావొచ్చు” అన్నారు. సైన్యాన్ని పాకిస్థాన్‌కు పంపించాలని, మసూద్ అజర్‌తోపాటు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
“ట్రంప్ చేయగలిగినపుడు, మీరు తక్కువేమీ కాదు. ట్రంప్ చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలగాలి” అన్నారు. “అబ్కీ బార్, ట్రంప్ సర్కార్” అని గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 2008 నవంబర్ 26న ముంబైలో 12 చోట్ల జరిగిన ఉగ్ర దాడుల్లో సుమారు 170 మంది మరణించగా, దాదాపు 300 మంది గాయపడ్డారు.