ఆధునిక కవితా ప్రపంచంలో లబ్ధ ప్రతిష్టుడైన కవి వీఆర్ విద్యార్థి. ఐదు దశాబ్దాల కిందట ఆయన రచించిన ‘అపరిచితులు’ కవిత అనేక మంది విమర్శకుల మన్ననలు పొందింది. ఈ కవిత విద్యార్థికి తెలుగు కవితా చరిత్రలో ఒక శాశ్వత స్థానాన్ని కల్పించింది. ప్రజాకవి కాళోజీతో వీఆర్ విద్యార్థికి సన్నిహిత సంబంధ బాంధవ్యాలుండేవి. సార్వజనీనత, విశ్వజనీనత అన్న విలువలను విద్యార్థి తన కవిత్వంలో నిక్షిప్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం రాసి గుర్తింపు పొందిన కవి వీఆర్ విద్యార్థి.
విద్యార్థి 12వ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన తర్వాత ముఖ్యంగా 1966 నుంచి విస్తృతమైన కవిత్వం రాశారు. విద్యార్థికి ఖండాంతర కవిగానూ పేరున్నది. ఆయన అసలు పేరు వేలూరి రాములు కాగా, కవిత్వం రాయడం మొదలుపెట్టాకనే విద్యార్థి అనే కలం పేరు పెట్టుకున్నారు. అప్పటినుంచే మేమంతా ఆయనను వీఆర్ విద్యార్థి అని పిలుస్తున్నాం. విద్యార్థి ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పనిచేశారు. 1964లో ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన విద్యార్థి 1965, 1971 యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
యాభై ఏండ్ల కిందనుకుంటాను. కాళోజీ అన్న కాళోజీ రామేశ్వర్ రావు ‘షాద్’ (ప్రఖ్యాత ఉర్దూ కవి) వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో ఆపరేషన్ చేయించుకుంటున్నట్టు తెలిసి వారిని చూడ్డానికి వచ్చాను (అప్పుడు నేను నల్గొండలో పనిచేస్తున్నాను).
రామేశ్వర్రావు ఉన్న రూంలోకి వెళ్లాను. అప్పుడు రామేశ్వర్ రావుకు సహాయకులుగా కాళోజీ నారాయణరావు, వీఆర్ విద్యార్థి ఉన్నారు. నేను రామేశ్వర్రావుతో మాట్లాడిన తర్వాత కాళోజీ నారాయణరావు నాకు విద్యార్థిని పరిచయం చేశారు. వీఆర్ విద్యార్థితో నాకు మొట్టమొదటి ప్రత్యక్ష పరిచయమది. అంతకుముందు విద్యార్థి రాసిన కవితలు కొన్ని చదివాను. అప్పటికే విద్యార్థికి, నాకూ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచేవి. కానీ, ప్రత్యక్షంగా చూడటం అప్పుడే. ఓసారి విద్యార్థి తాను రాసిన కవితనొకటి నాకు ఇచ్చి చూడమన్నారు. నేను కవిత చదివి ‘బాగానే ఉంది గాని రెండు, మూడు చోట్ల సవరణ చేస్తే ఇంకా బాగుంటుంది’ అన్నాను. ‘ఆ సవరణలేవో మీరే సూచించండి’ అని విద్యార్థి నాతో అన్నారు. నేను సవరించాలన్న మాటలను విన్న కాళోజీ ‘ఆయన కవితలో మార్పు చెయ్యమని అనవద్దు, ఆయన ఎట్లా రాస్తే బాగుంటుందో తానే నిర్ణయించుకుంటాడు’ అని నన్ను కోప్పడ్డారు. అయినప్పటికీ విద్యార్థి తాను రాసిన కవితలను నాకు పంపించి అభిప్రాయమడిగేవారు.
మహాకవి శ్రీశ్రీ 1946-52 మధ్య తెలంగాణను కుదిపేసిన వామపక్ష సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కవితలు రాయలేదు. ఎందుకు రాయలేదనడిగితే మౌనంగా ఉన్నాడేగాని సమాధానం ఇవ్వలేదు. శ్రీశ్రీ సమకాలికులైన ఆరుద్ర, సోమసుందర్ లాంటి అభ్యుదయ కవులెందరో తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాశారు. శ్రీశ్రీ ఎందుకు రాయలేదంటే ఆయనకు ఆ ఉద్యమాన్ని గురించి రాయాలనిపించలేదేమో! ప్యూర్ పోయెట్రీ తప్ప ఉద్యమాల గురించి ఆయనకు రాయాలని అనిపించలేదేమో! ఉద్యమాల గురించి రాస్తే అది నిజమైన కవిత్వం అనిపించలేదేమో!
ఒక్క ‘గర్జించు రష్యా’ అన్న కవితే ఆయన ఉద్యమాల గురించి రాసిన కవిత. అయితే, త్వరలో ఆ కవితకు కాలదోషం పట్టింది. విద్యార్థి కూడా ఉద్యమాల గురించి, యుద్ధాల గురించి కొంత కవిత్వం రాశారు. 1970లో మద్రాసు వెళ్లి జిడ్డు కృష్ణమూర్తితో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత విద్యార్థి ఆలోచనా మార్గంలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు 1970 తర్వాత వచ్చిన ఆయన కవితల్లో ప్రస్ఫుటమవుతుంది. విద్యార్థి ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడటం వల్ల ఆయనా, ఆయన భార్య రత్నమాలతో కలిసి అనేకసార్లు అమెరికా వెళ్లాడు.
అమెరికాలో స్థిరపడ్డ అనేకమంది తెలుగువాళ్లతో ముఖ్యంగా అక్కడి తెలుగు సాహితీవేత్తలతో, కవులతో, రచయితలతో స్నేహాన్ని పెంచుకున్నారు. అమెరికా అందాలను చూసి ఆయన రాసిన కవితల్లో ‘నయాగరా’ జలపాతం మీద రాసిన కవిత ఎంతో అద్భుతమైన, అందమైన కవితగా నాకిప్పటికీ గుర్తుకొస్తుంది.
ప్రజాకవి కాళోజీకి విద్యార్థి అత్యంత సన్నిహితుడు. కాళోజీ సోదరులకు, వారి కుటుంబానికి విద్యార్థి చేసిన సేవ అనితరసాధ్యమైంది. కాళోజీ కవిత్వాన్ని, కథలను, ఇతర రచనలను ఔపోసనపట్టిన చాలా కొద్దిమందిలో విద్యార్థి ఒకరు. విద్యార్థి మంచి స్నేహశీలి, స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి. స్నేహితులతో అభిప్రాయ భేదాలు ఏర్పడితే వాటిని త్వరలోనే మరిచిపోయి యథావిధిగా స్నేహం కొనసాగించేవారు. ఇప్పుడు విద్యార్థికి ఎనభై ఏండ్లు. ఇది ‘అశీతి’ ఉత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వకమైన అభినందనలు.
(వరంగల్ సాహితీ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి
‘అశీతి’ పూర్తి సభతో పాటు ‘కాలపుష్పం’ పుస్తకావిష్కరణ జరుగుతున్న సందర్భంగా..)
– (వ్యాసకర్త: సుప్రసిద్ధ నవలకారులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)
డాక్టర్ అంపశయ్య నవీన్ 99892 91299