మణికొండ, జనవరి 4 : ‘నువ్వంటే నాకు ఇష్టం… నన్నే ప్రేమించాలి.. లేదంటే చంపి పడేస్తా’ అంటూ ఓ వ్యక్తి ఓ యువతి గదిలోకి చొరబడి కత్తితో బెదిరించి అత్యాచారయ త్నం చేసిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలల్లోకి వెళితే…. నార్సింగి సర్కిల్ అల్కాపూర్ టౌన్‌షిఫ్‌లోని ఓ భవనం రెండో అంతస్తులో తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నివాసం ఉంటున్న యువతి(21) స్థానికంగా సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి న్యూఇయర్ వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో వచ్చింది. ఆ సమయంలో ఆమె రూమ్మెట్స్ ఇంకా తిరిగి రాలేదు. దాంతో ఆమె పడక గదికి తాళం వేయకుండా నిద్రిపోయింది. తెల్లవారుజామున మెలుకువ వచ్చి చూడగా తన మంచంపై పర్వతాల రోహిత్(23) అనే వ్యక్తి కూర్చుని ఉండటంతో షాక్‌కు గురైంది. ఆ క్షణంలో రోహిత్ కిచెన్‌లో ఉన్న కత్తి తీసుకొచ్చి ‘నన్ను ప్రేమిస్తావా.. చస్తావా? నువ్వంటే నాకు ఇష్టం నన్నే ప్రేమించాలి’ అంటూ బెదిరించినట్లు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తనపై దాడి చేయడమే కాక అసభ్యపదజాలంతో దూషించి పట్టుకునేందుకు వస్తుండగా గదిలో నుంచి తప్పించుకుని బయటకు వచ్చానని అంతలోనే స్నేహితులు వచ్చారని తెలిపారు. రోహిత్ గత కొన్నిరోజులుగా తనను వెంబడిస్తున్నాడని చిల్టాప్ కేఫ్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఎన్నిసార్లు నాకు ఇష్టం లేదని చెప్పినా తనను వేధిస్తున్నాడని వాపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రోహిత్‌ను రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగి ఎస్ఐ మునీందర్ తెలిపారు.