హైదరాబాద్ : ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM Chief) యూపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. యూపీలో గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌ను చంపిన హంతకులను నాథూరాం గాడ్సేతో ఓవైసీ పోల్చారు. అహ్మద్ సోదరులను చంపిన నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (ఉపా) చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదని యూపీ ప్రభుత్వాన్ని ఏఐఎంఐఎం ఎంపీ నిలదీశారు.
పోలీస్ కస్టడీలో ఉన్న వారిని చంపారు..వారిని చంపిన వారు టెర్రరిస్టులు..ఇది టెర్రర్ మాడ్యూల్ అని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. వారిని ఇలా వదిలేస్తే ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలిగొంటారు.. అసలు అహ్మద్ సోదరులను చంపిన వారిపై ఉపాను ఎందుకు ప్రయోగించలేదని ప్రశ్నించారు. హంతకులకు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను ఎవరు సమకార్చారని నిలదీశారు.
రూ. 8 లక్షల విలువైన ఆయుధాలను వారికి ఎవరు అందించారని అడిగారు. తిరుగుబాటు స్వభావంతో హంతకులు గాడ్సే బాటలో పయనిస్తున్నారని, వారిని నిలువరించకుంటే వారు మరింత మందిని బలితీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏప్రిల్ 15న పోలీస్ కస్టడీలో ఉన్న అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌లను మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా పోలీసులు, మీడియా సమక్షంలో దుండగులు కాల్చిచంపారు.
Read More