కోల్కతా : ఇంధన ధరల పెరుగుదలతో ఆ ప్రభావం నిత్యావసర ధరలపైనా పడింది. రవాణా వ్యయం తడిసిమోపెడై పండ్లు, కూరగాయల ధరలు భగ్గుమంటుండటంతో పాటు మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే చేపల ధరలూ కొండెక్కాయి. చేపల ధరలు కోల్కతాలో విపరీతంగా పెరగడంతో వాటి జోలికెళ్లేందుకు జనం సాహసించడం లేదు. కట్ల, రాహు వంటి చేపలు కిలో ఏకంగా రూ 50 పెరిగాయి.
గతవారం శ్యాంబజార్ మార్కెట్లో రూ 180-200 పలికిన చేపల ధరలు తాజాగా రూ 250కి ఎగబాకాయి. పబ్ధా చేప కిలో రూ 360 పలుకుతుండగా, భేక్తి రకం చేప రూ 500కు చేరింది. గత వారం ఈ చేప ధర రూ 400 పలికింది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా వ్యయం భారం కావడంతో చేపల వెరైటీలన్నీ కిలోకు రూ 50 పెరిగాయని వ్యాపారి రాజు వెల్లడించారు.
ఇక చేపల ధరలు పెరగడంతో తాము వాటిని తినడం తగ్గించామని చౌక రకం చేపల కోసం తాను మార్కెట్కు వచ్చానని సోంనాధ్ భట్టాచార్య అనే కస్టమర్ చెప్పుకొచ్చాడు. తమ కుటుంబం వారానికి రెండు సార్లు చేపను తీసుకుంటామని ధరల పెంపుతో ఇప్పుడు తినడం తగ్గించామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరగడంతో సబ్సిడీ ధరలకు ప్రభుత్వం రిటైల్ అవుట్లెట్ల ద్వారా పండ్లు, కూరగాయలు అందిస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.