శాసనసభలో సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన సర్కారు..విశ్వనగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌కు మరింత వెన్నుదన్నుగా నిలిచింది. ఒకవైపు అభివృద్ధి పనులకు ఆర్థిక చేయూతనందిస్తూనే.. సర్వ జనుల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించింది. తాగునీటికి ఎలాంటి ఆటంకం కలుగకుండా కాసుల వర్షం కురిపించింది. పాతబస్తీకి మెట్రో ప్రయాణించేలా..మూసీ సుందరీకరణ జరిగేలా నిధులు దక్కాయి. అలాగే హెల్త్ హబ్‌గా నిలిచిన నగరానికి.. నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నిమ్స్‌లో రెండు వేల అదనపు పడకల పెంపునకు కేటాయింపులు చేయడం విశేషం. ఇలా తాజా బడ్జెట్లో గ్రేటర్‌కు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా దూసుకుపోతున్న గ్రేటర్ హైదరాబాద్‌కు తెలంగాణ సర్కారు మరింత వెన్నుదన్నుగా నిలిచింది. ఆది నుంచి బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్.. ఈసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ అన్నిరంగాల్లో మరింత అభివృద్ధిని సాధించేందుకు ఆర్థిక చేయూత అందించారు. ముఖ్యంగా పౌరుల మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో అభివృద్ధి పనులకు భారీ కేటాయింపులు చేపడతూనే, పేదల సంక్షేమాన్నీ కొనసాగించేందుకు తగిన కేటాయింపులు చేసింది.
ఈ నేపథ్యంలో మహానగరంలో ప్రజలకు పుష్కలమైన తాగునీటిని సరఫరా చేసేందుకు పటిష్టమైన వ్యవస్థల ఏర్పాటుకు నిధులను కేటాయించింది. ఇదే తరుణంలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు, కొత్త పైపులైన్లు, మూసీ సుందరీకరణ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేలా నిధులను కేటాయించింది. ఇక దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో రైలును మరిన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించి ప్రజలను తక్కువ సమయంలోనే గమ్యస్థానాలు చేరేలా చర్యలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే హెల్త్‌హబ్‌గా నిలిచిన హైదరాబాద్ పరిధిలో అదనంగా నాలుగు వేల పడకల సామర్థ్యం పెరిగేందుకుగాను నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటు నిమ్స్‌లో రెండు వేల అదనపు పడకల పెంపునకు బడ్జెట్లో నిధులు కేటాయించడం విశేషం. ఇలా ఒకటేమిటి..! సోమవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో గ్రేటర్ హైదరాబాద్‌కు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి నేరుగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టడంతో పాటు కార్పొరేషన్ల కింద మౌలిక వసతుల కల్పనకుగాను చేపట్టిన పనులకు వేల కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకునేందుకు కూడా బడ్జెట్ముఖంగా అనుమతులు ఇచ్చింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అంతరాయాల్ని తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపట్టింది. ఎస్ఆర్డీపీ కింద కొనసాగుతున్న ఈ నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే అనేకం అందుబాటులోకి రాగా… ఈ ఆర్థిక సంవత్సరం మరో 30 ఫ్లైఓవర్లు, 18 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో పాటు చేపట్టిన 39 లింకు రోడ్లలో ఇప్పటికే 22 పూర్తి కాగా, మిగిలినవి త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
గతంలో బీసీలకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం బీసీల బడ్జెట్‌ను గతంలో కంటే పెంచారు.తెలంగాణ ప్రభుత్వం రూ. 3120 కోట్ల నుంచి ప్రస్తుతం బీసీల సంక్షేమానికి రూ. 5698 కోట్లకు పెంచడమంటే బీసీల పోరాట ఫలితమే. రూ. 10 వేల కోట్లకు పెంచితే బాగుండేది. 52 శాతం జనాభా గల బీసీల అభివృద్ధికి… మేం ఎంత శాతమో అంత నిధులు కేటాయించాలి.
– బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
2022-23బడ్జెట్లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూ. 17,700కోట్లు దళిత బంధుకు కేటాయించడం హర్షనీయం. పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి వేతనాలు పెంచాలనే సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రైతుబంధు, రైతుబీమాను మరింత పటిష్టం చేస్తూ వ్యవసాయరంగానికి నిధులు కేటాయించడం శుభపరిణామం. అన్ని రంగాలకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
– డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత
ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. వ్యవసాయం, ఆసరా పథకానికి నిధులు కేటాయించి పేదల మోముల్లో చిరునవ్వులు పూయించారు. పాలనలో తనదైన ముద్ర వేస్తూ దేశానికే తెలంగాణ రాష్ర్టాన్ని నమూనాగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. – సుర్వి యాదయ్యగౌడ్, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రపంచ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందే మహిళా సాధికారతపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపితమైంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు బడ్జెట్లో నిధులు కేటాయించడం ఇందుకు తార్కాణం. ముఖ్యమంత్రి వినూత్న నిర్ణయాలతో ప్రజాసంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
– పబ్బతి శ్రీకృష్ణ, మాలమహానాడు అధ్యక్షుడు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాబితాలో తొలి మూడు స్థానాలు
రంగారెడ్డి – రూ. 6,58,757
హైదరాబాద్ – రూ.3,51,332
మేడ్చల్-మల్కాజిగిరి – 2,40,008
అటవీ విస్తీర్ణం
హైదరాబాద్ – 0.80% రంగారెడ్డి – 5.93%
మేడ్చల్-మల్కాజిగిరి – 7.66%
హరితహారం కింద నాటిన మొక్కలు..
జీహెచ్ఎంసీ – 2,11,90,000
హెచ్ఎండీఏ – 3,33,80,000
జీహెచ్ఎంసీ గ్రీన్ బడ్జెట్ వ్యయం ఇలా..
(2020-21లో) – మొత్తం – రూ.306.65 కోట్లు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
హైదరాబాద్ – 48,224
రంగారెడ్డి – 26,520
మేడ్చల్-మల్కాజిగిరి – 25,752
రహదారుల పరిమాణం –
9,013 కిలోమీటర్లు
బ్లాక్‌టాప్ రోడ్లు – 2,846 కి.మీ.
సిమెంటు రోడ్లు – 6,187 కి.మీ.
రోడ్ల విస్తీర్ణం (ప్రతి వంద చదరపు కిలోమీటర్లకు)
హైదరాబాద్ – 4,148 కి.మీ
రంగారెడ్డి – 101 కి.మీ.
మేడ్చల్-మల్కాజిగిరి – 89 కి.మీ.
కరెంటులోనూ టాపే
రాష్ట్రంలో జిల్లాలవారీగా విద్యుత్తు కనెక్షన్లు పరిశీలించినపుడు.. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలూ తొలి మూడు స్థానాల్లో ఉండటం విశేషం.

