అహ్మదాబాద్ : గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్ధరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వడోదరలో ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఓపీఎస్ అమలు చేయాలని కోరుతూ చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతున్నారని, పంజాబ్‌లో ఓపీఎస్ అమలుకు తమ సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారని, గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కూడా ఓపీఎస్ అమలు చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
2004లో పాత పెన్షన్ పధకానికి స్వస్తి చెప్పి నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. ఓపీఎస్‌లో ఉద్యోగి చివరి జీతంలో సగం పెన్షన్‌గా అందిస్తారు. ఈ మొత్తం వ్యయం ప్రభుత్వం భరిస్తుంది. ఇక గుజరాత్లో తమ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపడితే మద్యం విధానం యధాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గుజరాత్ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్, బీజేపీలకు లేదని ఆరోపించారు. వడోదర ఎయిర్పోర్ట్ వెలుపల మోదీకి అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల కేజ్రీవాల్ స్పందిస్తూ కొద్దిమంది తనకు వ్యతిరేకంగా, మోదీకి జైకొట్టడం వల్ల తమ పార్టీకి ఎలాంటి నష్టం చేకూరదని స్పష్టం చేశారు. భగవంత్ మాన్ నాయకత్వంలో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం పలు విజయాలు సాధించిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.