Sheikh Hasina | ఢాకా, అక్టోబర్ 17: బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినందుకు ఆమెతో పాటు మరో 45 మందిపై ట్రిబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వారెంట్లు జారీ అయిన వారిలో హసీనా పార్టీ అవామీ లీగ్ అగ్ర నేతలు ఉన్నట్టు ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. వీరందరినీ నవంబర్ 18లోగా తమ ముందు హాజరు పరచాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. హసీనా, అవామీ లీగ్ నాయకులు, కూటమిలోని 14 రాజకీయ పార్టీల నేతలు, పాత్రికేయులు, మాజీ ఉన్నతాధికారులపై ఐసీటీలో 60కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం కావడంతో ఆగస్టు 5న హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే.