ఎదులాపురం, మార్చి 7 : జిల్లా పర్యటనకు వచ్చిన సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్ సర్వీస్ శిక్షణ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పాడి ఆదిలాబాద్ మండలంలోని కచ్కంటి, బోథ్ మండలం సాకేరా, గుడిహత్నూర్ మండలం సీతాగొంది, నేరడిగొండ మండలం కుమారి , తలమడుగు మండలం సుంకిడి, తాంసి మండలం కప్పర్ల గ్రామాల్లో మూడు రోజులు పాటు పర్యటించనున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి, విద్యార్థుల హాజరు, విద్యాభ్యాసం , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వ్యవసాయం, తదితర అంశాలపై శిక్షణ అధికారులు అధ్యయనం చేస్తారని తెలిపారు. వారికి సంబంధిత శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ నెల 10వ తేదీన ఇచ్చోడ మండలం ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన ముక్రా(కే), జిల్లాలో పర్యాటక కేంద్రాలైన నేరడిగొండ మండలం కుంటాల జలపాతాన్ని ,11న జైనథ్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. 12వ తేదీన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ అధికారులు మూడు రోజుల పర్యటనపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, సివిల్ సర్వీసెస్ అధికారులు, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, డీఆర్డీఏ కిషన్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రవీందర్, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మార్చి 7 : ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకంలో భాగంగా వీధి వ్యాపారులను గుర్తించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ సంజీవ్ శ్రీ వాస్తవ కలెక్టర్లకు సూచించారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వనిధి అర్హులకు అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకం కింద 8647 మంది వీధి వ్యాపారులను గుర్తించామన్నారు. ఇందులో 5410 మందికి రుణాలు మంజూరు చేశామన్నారు. ప్రధానమంత్రి స్వనిధి అవార్డు ఎంపికకు మున్సిపాలిటీలో అమలవుతున్న వివిధ పథకాల అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ బండి రవి, మెప్మా డీఎంసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.