హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్‌కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్కొన్నది. నాలుగు వారాల్లోగా న్యాయవాదిని నియమించుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కోర్టు కేసుల విచారణ ప్రక్రియ ఇంగ్లిషులో కొనసాగించాలనే నిబంధన ఉన్నదని గుర్తుచేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు 22కుపైగా కాంట్రాక్ట్‌లు ఇచ్చిన పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ 2020లో ఖమ్మం జిల్లా సీతారాంపురానికి చెందిన తుమ్మలపల్లి రాంబాబు పార్టీ ఇన్‌పర్సన్‌గా పిల్ దాఖలు చేయగా, హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తెలుగులో వాదనలు వినిపిస్తూ సమాచార హకు చట్టం కింద కాంట్రాక్టర్‌కు చెందిన అక్రమాలపై సమాచారంతో పిల్ వేసినట్టు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఇంగ్లిషులో వాదించాలని కోరింది. లేనిపక్షంలో న్యాయవాదిని నియమించుకోవాలని, ఒకవేళ నియమించుకోలేకపోతే న్యాయసేవాధికార సంస్థ ద్వారా తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.