సిటీబ్యూరో/మణికొండ, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : మూసీ నదీపై ఆక్రమణలు కూల్చకుండా సుందరీకరణ, రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులంటూ రేవంత్‌రెడ్డి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పేదోడిని బతుకులను రోడ్డున పడేసిన రేవంత్ సర్కారుకు చురుకు పెట్టినట్టుగా జూబ్లీహిల్స్ ప్రజలు ఓటుతో సమాధానమివ్వాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చకుండా చేసే ప్రణాళికలన్నీ కూడా కోట్ల రూపాయలు రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో కాజేసేందుకేననే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.
ఆదివారం నార్సింగి పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రావు, రోహిత్‌రెడ్డి, నాయకులు కార్తీక్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ ఆదిత్య నిర్మాణ సంస్థ మూసీ బఫర్ జోన్‌ను ఆక్రమించిందనే విషయం తెలిసినా అటువైపు హైడ్రా కానీ, కాంగ్రెస్ సర్కారు గానీ వెళ్లడం లేదన్నారు. ఇటీవల వచ్చిన వరదల్లో ఆదిత్య ఆక్రమణల బాగోతం బయటపడిందని తెలిపారు. బఫర్‌లో పేదోడు కట్టుకున్న చిన్న ఇంటిని కూడా కనికరం లేకుండా కూల్చిన కాంగ్రెస్ సర్కారు, హైడ్రా అధికారులు.. మూసీని ఆక్రమించి కట్టిన ఆదిత్య సంస్థ నిర్మాణాలను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.
ఇంట్లో ఉండే సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా, కనీసం చిన్నారుల కంటతడి చూసి కూడా కరుణించని హైడ్రా.. వీటిని ఎందుకు నేలమట్టం చేయలేదని నిలదీశారు. బఫర్ జోన్ నిర్ధారించడానికి హైడ్రా ఎవరు? అంటూ ప్రశ్నిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. మూసీ పై హైడ్రాకు ఎలాంటి అధికారం లేదని ప్రభుత్వాన్ని ఓ ప్రైవేటు సంస్థ సవాలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల విషయంలో పేదోళ్లకు ఒక నీతి, పెద్దోళ్లకు మరో నీతితో పనిచేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. హైదర్షాకోట్ నుంచి గంధంగూడ వరకు ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఏండ్లకేండ్ల నుంచి ఉన్న ఇండ్లను కూడా కూల్చివేస్తామని పేదోడి కంటిమీద కునుకు లేకుండా చేశారన్నారు.
కానీ మూసీని అడ్డగోలుగా ఆక్రమించి కడుతున్న ఆదిత్య నిర్మాణ సంస్థ భవనాలను మాత్రం కూల్చలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పాత టోపోషీట్లను తీసుకొచ్చి, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అనుమతులు ఉన్నాయంటూ భారీ భవంతులను కడుతుంటే పేదోడి ఇండ్ల మీదకు మాత్రం హైడ్రా బుల్డోజర్లు దూసుకొస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇదంతా చూస్తుంటే జల వనరులను పరిరక్షించడం కోసం హైడ్రా తెచ్చినట్లు లేదని.. కేవలం పేదల ఇండ్లను నేలమట్టం చేసేందుకేనని అర్థమవుతున్నదని సబితారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో వందలాది నిర్మాణాలకు అనుమతులిచ్చిందని పెద్దల కోసమే ఏకపక్షంగా వ్యవహరిస్తూ వసూళ్ల కోసమే హైడ్రాను వినియోగిస్తున్నదని రేవంత్ సర్కారు చర్యలతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని సబితా ఆరోపించారు.
మూసీ ఆక్రమణలు నిండుతున్నా కనిపించలేదా : సుధీర్‌రెడ్డి
కేసీఆర్ సర్కారు 75శాతం ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే, ఇప్పుడున్న సీఎం రేవంత్ వాటిని ప్రారంభిస్తున్నారని మాజీ చైర్మన్ దేవీరెడ్డి సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రూ.2800 కోట్లతో మూసీ వెంట 36 సీవరేజీ ప్లాంట్ల నిర్మాణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. మూసీ వెంబడి 50 మీటర్ల పొడవున బఫర్ జోన్ నిర్ధారించి ఆ భూమిని ప్రజావసరాలకు వినియోగించాలనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు బఫర్ జోన్‌ను ఆక్రమించి భారీ నిర్మాణాలు కడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గండిపేట్ నుంచి మొదలు బఫర్ జోన్‌ను ఆక్రమించుకున్నా హైడ్రా, సర్కారు కళ్లకు కనిపించడం లేదని నిలదీశారు. మూసీ ఆక్రమణలను కూల్చకుండా, ప్రక్షాళన చేస్తామంటే ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదల ఇండ్లకు మార్కింగ్ చేసిన రేవంత్‌రెడ్డి… పెద్దోళ్ల నిర్మాణాలను కూడా మార్కింగ్ చేసి, హైడ్రా బుల్డోజర్లను ఎగదోయాలని డిమాండ్ చేశారు. మూసీ ఆక్రమణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని వాటిని నేలమట్టం చేసేదాకా పోరాట ఆగదని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.