సిటీబ్యూరో, నవంబరు 2 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు, నిర్వహణ, ఫలితాల వెల్లడి, అభ్యర్థుల వివరాలు, ఓటర్ల నమోదు, సందేహాల నివృత్తి ఇలా ఎన్నికల సమస్త సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండనుంది. ఇందుకు సరికొత్త డిజిటల్ వేదిక ఈసీఐ-నెట్ మొబైల్ అప్లికేషన్‌ను ఇటీవలే భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇకపై ఎన్నికల సంఘానికి సంబంధించిన వేర్వేరు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పినైట్లెయింది.
ఎన్నికల సంఘం సమాచారం కోసం ఇప్పటివరకు ఉపయోగిస్తున్న 40 వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల అనుసంధానంతో ఈసీఐనెట్‌ను ఈసీఐ రూపొందించింది. అఫిడవిట్ పోర్టల్, ఇండియా ఎ వెబ్, రిజల్ట్ వెబ్సైట్, ఎలక్షన్, ఈసీఐ స్వీప్, ఈసీఐ వెబ్సైట్, ఎలక్షన్ ట్రెండ్స్, సీ విజిల్ పోర్టల్, ఈఎంఎస్, ఆర్టీఐ పోర్టల్, ఎన్కోర్, మీడియా వోచర్, అబ్జర్వర్ పోర్టల్, ఎలక్షన్ ప్లానింగ్, ఐఈఎంఎస్, ఏరో నెట్ 2.0, ఓటర్స్ సర్వీస్ పోర్టల్, సర్వీస్ ఓటర్ పోర్టల్, ఎలక్ట్రోరల్ సెర్చ్ తదితర వెబ్సైట్లతో పాటు ఏరో నెట్ యాప్, బీఎల్వో యాప్, సీ విజిల్, డిసైడర్, ఎన్కోర్ నోడల్, ఈఎస్ఎంఎస్, ఇన్వెస్టిగేటర్, కేవైసీ తదితర అప్లికేషన్లన్నీ ఈసీఐ-నెట్ మొబైల్ ఆప్లికేషన్ పేరుతో ఈసీఐ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది.
ఎన్నికల సేవలకు సంబంధించి 40కి పైగా యాప్‌లను ఏకీకృతం చేస్తూ ఈసీఐ ‘ఈసీఐ-నెట్’ అనే కొత్త డిజిటల్ వేదికను ప్రవేశపెట్టింది. ఇక నుంచి అన్ని సేవలు ఒకే చోట లభ్యం కానున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలతో ప్రారంభమైన ఈ అప్లికేషన్ సేవలు త్వరలోనే అన్ని రాష్ర్టాల్లో అందుబాటులోకి రానున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ అప్లికేషన్‌గా ఈసీఐ-నెట్‌కు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ అప్లికేషన్ ఎంతగానో దోహదపడనుంది.