మేడ్చల్, దుండిగల్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారుకు దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అక్రమించిన రూ.1100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సవాల్ విసిరారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని ప్రభుత్వ విప్ గాంధీ అక్రమించిన ప్రభుత్వ భూమి 307 సర్వే నెంబర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల బృందం నిరసన తెలిపారు.
మాజీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డితో ఆయన మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ ఎమ్మెల్యే అరికెపూడి అక్రమించిన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా హైడ్రా తీరు సిగ్గుచేటు అని మండిపడ్డారు.
అరికెపూడి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఫెన్సింగ్‌ను హైడ్రా అధికారులు తొలగించిన 24గంటల్లోనే తిరిగి ఫెన్సింగ్ నిర్మించినా హైడ్రా చూసిచూడనట్లుగా వ్యహరిస్తున్నదని ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తున్నదని సర్కారు భూముల నుంచి పేదలను వెళ్లగొట్టి పెద్దలకు కట్టబెడుతున్నదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన అరికెపూడి గాంధీకి ప్రభుత్వం నజరానాలు ఇస్తున్నట్టు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌లా మారిందని సీఎం రేవంత్ హైడ్రాను సృష్టించింది భూములను దోచుకునుందేకనని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేశంలోని ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తే.. రేవంత్ రెండేళ్ల దుర్మార్గ పాలనలో పేదల హాహాకారాలు, సమస్యలతో కాంగ్రెస్ సర్కారును చీదరించుకుంటున్నారని పేర్కొన్నారు.
పేదల బతుకులు కూల్చుతున్న రేవంత్ మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి పేదల బతుకులు కూల్చుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కొనుకున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం నజరానాలు ఇస్తున్నదని ఆరోపించారు. భూ అక్రమార్కులకు మంత్రులు కాపాలా ఉంటున్నారు. కేసీఆర్ పిలుపు ఇస్తే హైడ్రాను, పోలీసులను అడ్డుకోవడం ఎంత సేపని పేర్కొన్నారు.
హైడ్రా అరాచకాలను నిలదీస్తాం
హైడ్రా చేస్తున్న అరాచకాలను నిలదీస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కూల్చివేతల పేరుతో పేదలను రోడ్డుపాలు చేస్తున్నారని హైడ్రా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల భూ ఆక్రమణలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదన్నారు. పేదల ఇండ్లు కూల్చే ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వరని, పెద్దల ఇండ్లకు మాత్రం నోటీసులు ఇచ్చి హైడ్రా వదిలివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గాజుల రామారంలో పేదల ఇండ్లు కూల్చివేసి కరెంట్ కట్ చేశారని ఎమ్మెల్యే అరికెపూడి అక్రమించిన భూమిని హైడ్రా కూల్చినా తిరిగి ఫెన్సింగ్ చేసిన ఏమీ చేయని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆగ్రహించారు. కాంగ్రెస్ అరాచకాలను ఎండగట్టేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.