ఖమ్మం అర్బన్, నవంబర్ 2: ఖమ్మం జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో చదివే విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలకు రావొద్దని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెసేజ్లు పంపించాయి. విద్యాసంస్థల నిర్వహణకు తమకు శక్తిలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే విద్యాసంస్థలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చామని తెలిపాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ సర్కార్ను వేడుకున్నా.. త్వరలో చెల్లిస్తామని మాయమాటలు చెప్పిందే తప్ప నిధులు విడుదల చేయలేదని ఆరోపించాయి. దీంతో బంద్ ఒక్కటే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాయి. దీంతో సోమవారం నుంచి కాలేజీల నిరవధిక బంద్ జరుగనుంది. ఫీజు బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ నాటినుంచి ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు విన్నవిస్తూనే ఉన్నారు.
రెండేళ్లుగా ‘అదిగో ఇదిగో’ అంటూ కాలం వెళ్లబుచ్చింది. దీంతో గత నెలలో కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ పాటిస్తామని అల్టిమేటం జారీ చేశాయి. సెప్టెంబర్లో విద్యార్థి సంఘాలు సైతం యాజమాన్యాలకు అండగా నిలిచి భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యాలు విన్నవించాయి. రాష్ట్రస్థాయిలో బంద్ పాటిస్తూ విద్యార్థులు సైతం రోడ్డెక్కడంతో ప్రభుత్వం దసరా, దీపావళికి విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు వెనక్కు తగ్గాయి. కానీ అన్ని పండుగలు అయిపోయినా నిధులు మాత్రం విడుదల చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని గ్రహించి ఈ ధపా నిధులు విడుదల చేసేవరకు నిరవధిక బంద్ పాటించాల్సిందేనంటూ నిర్ణయించాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే కళాశాలలను బంద్ చేస్తామని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో కాంగ్రెస్ సర్కార్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలంటూ ప్రకటించింది. అయినా యాజమాన్యాలు వెనక్కి తగ్గలేదు. బకాయిలు విడుదల చేసి తర్వాత తనిఖీలు చేసుకోందంటూ స్పష్టం చేశాయి. అయితే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.