హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తనకు సంబంధించినంత వరకు రాజకీయాలు అంటే ఒక టాస్క్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తుంటారు. అదే ఆయనను దేశ రాజకీయాల్లోనే విలక్షణ నేతగా నిలబెడుతున్నది. నిరంతర అధ్యయనం, సునిశిత పరిశీలన ఆయనను గొప్ప రాజకీయవేత్తగానే కాదు, అద్భుతమైన వక్తగా తీర్చిదిద్దాయి. ఆయన ప్రసంగం ఎదుటివారిని సమ్మోహనపరుస్తుంది. ఉత్తేజపరుస్తుంది. ఆవేశం రగిలిస్తుంది. ఆలోచింపజేస్తుంది. కార్యోన్ముఖులను చేస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏ విషయాన్ని ఎంతసేపు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన నాయకుడు కేసీఆర్. నిజానికి ఆయన ప్రసంగించడం కోసం ప్రత్యేకంగా ఏమీ ప్రిపేర్ కారు. మనం మాట్లాడే ప్రతి మాటకూ, ప్రతి పదానికీ విలువ ఉం టుందని, జాగ్రత్తగా మాట్లాడాలని తరచూ చెప్తుంటారు.
తాను సభల్లో ప్రసంగిస్తున్నప్పుడు కుర్రకారు ఈలలు వేస్తుంటే సముదాయించే కేసీఆర్.. నిజానికి ప్రజల నుంచి వచ్చే స్పందనే నాయకుడికి ‘కిక్’ ఇస్తుందని అంటుంటారు. అయితే అతిగా ఈలలు వేస్తే మాట్లాడే వారి మూడ్ మారుతుందని, అందుకే ఈలలు వేయొద్దని సముదాయిస్తానని చెప్తుంటారు. తన పంచ్ డైలాగ్‌లతో సోషల్‌మీడియాలో మీమ్స్ చేసేవారి టాలెంట్‌ను చూ స్తుంటే ముచ్చటేస్తుందని, వారిని మెచ్చుకోవాలనిపిస్తుందని ఒక సందర్భంలో చెప్పడం విశేషం. సీఎం కేసీఆర్ రాజకీయాలతోపాటు బాగా ఇష్టపడే మరో అంశం వ్యవసాయం. వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాలు చేయడమంటే ప్రీతి. గతంలో కలర్ క్యాప్సికం, ఆలు, అల్లం.. ఇలా వివిధ పంటలతో ప్రయోగాలు చేశారు. వాణిజ్యపంటలపై దృష్టి పెడతారు. కారు డ్రైవింగ్ ఆయనకు ఇష్టమైన వ్యాపకం.
ఇవంటే ఇష్టం
రాజకీయాల్లో బిజీగా, సీరియస్‌గా ఉండే కేసీఆర్.. అప్పుడప్పుడు సతీమణి శోభమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇస్తుంటారట. ఇటీవల ఒకసారి ఆన్లైన్లో చీరలు ఆర్డర్ చేసి మరీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆయనకు జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాలన్నా, షోలే, ఆరాధన, సాగరసంగమం, స్వాతిముత్యం, అమితాబ్‌బచ్చన్, ఎన్టీఆర్, కృష్ణ పాత సినిమాలన్నా ఇష్టంగా చూస్తుంటారు. నాటుకోడి, టమాట పప్పు, రోటి పచ్చడి, పచ్చిపులుసు అంటే ఇష్టపడే కేసీఆర్.. మితహారం తీసుకుంటారు. తెలుపు, మెరూన్ రంగులకు ఎక్కువగా ఇష్టపడతారు. తెలంగాణ రాష్ట్రం సాధించడమే తన జీవితంలో అత్యంత ఆనందకర క్షణాలని చెప్తుంటారు. ఇక కేసీఆర్‌కు ఇష్టమైన పుస్తకం: ‘ఓల్గా నుంచి గంగా తీరం వరకు’. అబిడ్స్‌లోని మెట్రో ఫుట్‌వేర్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉండే శ్రీ సాయి ఖాదీ వస్త్రాలయం కేసీఆర్‌కు షాపింగ్ కేంద్రాలు. 50 ఏండ్లుగా అక్కడే బట్టలు కొంటున్నానని, అ క్కడ ఉండే టైలర్‌తో కుట్టించుకుంటున్నానని కేసీఆర్ చెప్పడం విశేషం. చిన్నప్పటి నుంచీ పట్టుదల, మొండితనం, అనుకున్నది సాధించేవరకు విశ్రమించని గుణం ఆయనను విజేతగా నిలబెట్టాయి. నిలబెడుతున్నాయి.