AP News : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆ రాష్ట్ర హోంమంత్రి (AP Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anita) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ.5.46 కోట్లు కేటాయించి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అనిత వ్యాఖ్యానించారు.
పాయకరావుపేట నియోజకవర్గాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి అనిత స్పష్టంచేశారు. రెండేళ్లలో పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై హోంమంత్రి అనిత ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఫొటోలతో సహా వివరించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో రెండేళ్లలో సుమారు రూ.1,150 కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అనిత చెప్పుకొచ్చారు. పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలోని పంచాయతీరాజ్‌లో 871 పనులకు గానూ రూ.118 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
గ్రామాల అభివృద్ధి కోసం 172 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని మంత్రి తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఆర్ అండ్ బీలో 36 పనులకు గానూ 137 కిలోమీటర్ల రోడ్డు రూ.130 కోట్లతో అభివృద్ధి చేశామని వివరించారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించటం కోసం రూ. 66 కోట్లతో 244 పనులు చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు.