హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశానికి ఏపీ సర్కారు డుమ్మా కొట్టింది. దీంతో యాసంగి సాగు, వేసవి తాగునీటి వాటాల అంశం ఎటూ తేలకుండాపోయింది. ఏపీ గైర్హాజరుతో సమావేశాన్ని బోర్డు నేటికి వాయిదా వేసింది. ఏపీ సర్కారు తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల నుంచి వినియోగించుకోవాల్సిన నీటి వాటాలను తేల్చేందుకు కేఆర్ఎంబీ 24న సమావేశాన్ని నిర్వహించింది. రెండు రిజర్వాయర్లలో కలిపి 64 టీఎంసీలే అందుబాటులో ఉండగా, ఇరు రాష్ర్టాల డిమాండ్లు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఏపీ 33 టీఎంసీలు, తెలంగాణ 116 టీఎంసీలు కావాలని బోర్డుకు నివేదించాయి. దీంతో బోర్డు చేతులెత్తేసింది. రాష్ర్టాల నీటివాటాలను తేల్చుకోవాలని చేతులు దులుపుకుంది. అందుకు సీఈల స్థాయిలో కమిటీ వేసింది. ప్రత్యేకంగా సమావేశమై అందులో చర్చించుకుని రావాలని సూచించింది. అనంతరం బుధవారం మరోసారి భేటీ అవుదామని వెల్లడింది. బోర్డు సూచన మేరకు సీఈలు సమావేశమయ్యారు.
ఈ క్రమంలో బుధవారం జలసౌధలో మధ్యాహ్నం బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు కేఆర్ఎంబీ సమాయత్తమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే ఏపీ అధికారులు మాత్రం సమావేశానికి గైర్హాజరయ్యారు. మీటింగ్ మొదలయ్యే సమయానికి రావట్లేదని సమాచారమిచ్చారు. ఆన్లైన్లోనైనా హాజరుకావాలని బోర్డు అవకాశం కల్పించినా ఏపీ అధికారులు వినిపించుకోలేదు. శివరాత్రి పండుగ కాబట్టి మీటింగ్‌లో పాల్గొనలేమని చెప్పారు. ఏపీ అధికారుల తీరుపై తెలంగాణ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బోర్డు ఆదేశాలకే విలువివ్వకపోతే ఎలా అని చైర్మన్ అతుల్‌జైన్ ఎదుట ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ అనిల్‌కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తరలించకుండా ఏపీని నిలువరించాలని బోర్డుకు తేల్చిచెప్పారు. అదేవిధంగా సాగర్ కుడి కాల్వ నుంచి 7 వేల క్యూసెకులు కాకుండా కేవలం 5వేల క్యూసెకులకే ఏపీని పరిమితం చేయాలని తెలిపారు. సీఈల మీటింగ్‌కు సంబంధించిన వివరాలను బోర్డుకు నివేదించారు. రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు ఏప్రిల్ వరకే 63 టీఎంసీలు కావాలని, ఆ మేరకు జలాలను ఇవ్వాల్సిందేనని వెల్లడించింది. ఏపీ కోటాలో ప్రస్తుతం 25 టీఎంసీలే ఉన్నా కూడా 55 టీఎంసీలు కావాలంటూ డిమాండ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. అనంతరం బోర్డు సమావేశాన్ని నేటి ఉదయానికి చైర్మన్ వాయిదా వేశారు.