కాచిగూడ, జనవరి 29: కేంద్ర ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీలు వీ హనుమంతరావు, అజీజ్ పాషా, సీపీఎం నేతలు వీరయ్య, బాల మల్లేశ్ హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. గతేడాది బడ్జెట్లో కేంద్రం బీసీల అభివృద్ధికి రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నదని ఆరోపించారు. బీసీల అభివృద్ధిని కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. బీసీలు తిరుగుబాటుచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వీహెచ్ మాట్లాడుతూ.. జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తేనే బీసీల బతుకులు బాగుపడుతాయని అన్నారు. 130 కోట్ల దేశ జనాభాలో 65 కోట్ల మంది బీసీలే ఉన్నారని గుర్తుచేశారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ.. బీసీ బడ్జెట్ విషయంలో కేంద్రం అంకెల గారడీ చేస్తున్నదని, దీంతో బీసీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్, ఆమ్ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభ, బీఎస్పీ నేత జ్యోతి, శివసేన పార్టీ నేత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.