తిరుమల/హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మరో నడకమార్గం రూపుదిద్దుకోనున్నది. అన్నమయ్య కాలిబాట మార్గాన్ని ఇందుకోసం అభివృద్ధి చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. శనివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలకనిర్ణయాలు తీసుకొన్నారు. సమావేశం అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు. భక్తుల సౌకర్యార్థం అన్నమయ్య కాలిబాటమార్గాని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు. అన్నమయ్య ఈ మార్గం నుంచే తిరుమలకు చేరుకొనే వారని వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టుమార్గంలో రూ.3.6 కోట్ల వ్యయంతో, రెండో ఘాట్రోడ్డులో రూ.3.95 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు బోర్డు ఆమోదించినట్టు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, జనవరి 13న దర్శనం ప్రారంభమవుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులకు ఉచిత దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు సడలిస్తే సర్వదర్శనం పెంచి, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. వర్షం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ వద్ద కొట్టుకుపోయిన ఆలయాలను పునర్నిర్మిస్తామని వెల్లడించారు. కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణం తదితర ధార్మిక కార్యక్రమాలు తెలుగు రాష్ర్టాలతోపాటు ప్రముఖ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.