హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో అకడకడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురియనున్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్య, దక్షిణ తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 3.58 సెం.మీ, కొత్తగూడెంలో 3.14 సెం.మీ, బూర్గంపాడులో 2.98 సెం.మీ, చెంచుపల్లిలో 2.73 సెం.మీ, లక్ష్మీదేవిపల్లిలో 2.62 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో 3.16 సెం.మీ, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌లో 3.10 సెం.మీ, దామెరలో 2.54 సెం.మీ, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 3 సెం.మీ, ఖానాపూర్‌లో 2.45 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వివరించారు.