మేడ్చల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): జవహర్‌నగర్ డంపింగ్‌యార్డు నుంచి వచ్చే దుర్వాసనకు శాశ్వతంగా చెక్ పడనుంది. ఇక్కడ పోగవుతున్న వ్యర్థాలను ఏరోజుకారోజు వినియోగిస్తూ కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15 ఎకరాల్లో రూ.700 కోట్లతో 28 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు. మరో వారం రోజుల్లో ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి క్లియరెన్స్ రాబోతుందని ఇప్పటికే విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసినట్లు.. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని రాంకీ నిర్వాహకులు వెల్లడించారు.
ఎప్పటి చెత్త అప్పుడే వినియోగించేలా..
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. దీనికి ప్రతిరోజు సుమారు మూడు వేల మెట్రిక్ టన్నుల చెత్తను వినియోగిస్తున్నారు. రెండో యూనిట్లో భాగంగా 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైతే మొత్తం 48 మెగావాట్ల ఉత్పత్తికి ఏడు వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల చెత్త అవసరం ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు డంపింగ్ యార్డుకు 7వేల 4 వందల మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు. 28 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అనుమతులు వచ్చిన వెంటనే ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని రాంకీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త ఏ రోజుకారోజు వినియోగమై దుర్వాసనకు చెక్ పడటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసనను తొలగించేందుకు డ్రోన్ల ద్వారా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. మరొకొంత చెత్తను ఎరువుల తయారీకి వినియోగిస్తున్నారు.
దుర్వాసన రాకుండా చర్యలు..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసనకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎప్పటి చెత్తను అప్పుడే వినియోగించేలా 28 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఈ కేంద్రానికి అనుమతులు రాబోతున్నాయి. విద్యుత్ కేంద్రం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.