హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ వ్యవహారాలు ఎప్పుడూ ఏదో వివాదంలో కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఆలయ భూముల వివాదం, ఆ తర్వాత ప్రసాదంలో తూకం వివాదం.. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి ఆలయ నిర్వహణలో లోపాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మతపరమైన ఉద్యోగుల భర్తీ విషయంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు భద్రాచలం దేవస్థానం నుంచి నోటిఫికేషన్ జారీచేశారు. అందులో ఆస్థాన పురోహిత్ పోస్టును పేర్కొనకపోవడంపై వివాదం తలెత్తింది. గత మూడేండ్లుగా ఈ పోస్టు భర్తీ విషయంలో దేవస్థాన అధికారులు, అర్చకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పోస్టు ఉంచాలా? తీసేయాలా? అనే విషయంలో ఎటూ తేలకపోవడంతో ఎవరిని కూడా నియమించడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఆలయంలో మతపరమైన పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఆస్థాన పురోహిత్ పోస్టు లేకుండానే ప్రకటన జారీచేశారు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దేవాదాయ శాఖ అధికారులతోపాటు భద్రాచలం దేవస్థానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొన్నేండ్లుగా ఆస్థాన పురోహిత్ పోస్టు కొనసాగింది. చివరగా 2022లో ఈ పదవిలో పనిచేసిన ఉద్యోగి రిటైరయ్యారు. అప్పటినుంచి ఈ పోస్టు ను భర్తీ చేయలేదు. ఇందుకోసం పలువురు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, తాత్కాలికంగా కూడా నియామకం జరపలేదు. ఈ పోస్టును భర్తీ చేయకుండా ఆలయ అర్చకులు అడ్డుపడుతున్నారని, రాష్ట్రస్థాయి అధికారులు, దేవాలయ అధికారులతోకలిసి పోస్టును భర్తీ చేయకుండా కుట్రచేస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. తగిన అర్హతలున్న వ్యక్తులు ఆలయానికి, దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ, అధికారులు ఎందుకు భర్తీ చేయడంలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వేదపండితుడు రామావఝ్జల కల్యాణ్‌రామ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తనకు కూడా ఆస్థాన పురోహిత్ పోస్టుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, అయితే ఈ పోస్టు తనకే ఇవ్వాలని కాదని, ఆస్థాన పురోహిత్ ఉద్యోగానికి సంబంధించిన నియామక ప్రకటన ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి అర్హులను ఎంపిక చేయాలని, క్యాడర్ స్ట్రెంత్‌లో ఉన్న పోస్టును ఎలా లేకుండా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దేవస్థాన ఏఈవో భవానీరామకృష్ణ వివరణ ఇస్తూ.. ఆలయానికి సంబంధించిన వైదిక బృందం ఈ పోస్టు అవసరం లేదని తమకు లేఖ రాయడంతో నోటిఫికేషన్లో ఈ పోస్టును చేర్చలేదని వివరించారు.