బంజారాహిల్స్, ఏప్రిల్ 10: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టై విచారణ ఎదుర్కొంటున్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మరో కేసు నమోదైంది. తమ సంస్థ డైరెక్టర్ల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకొని, తనను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కొని, కంపెనీ నుంచి బయటకు గెంటేశారని ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. మణికొండవాసి వేణుమాధవ్ చెన్నుపాటి హార్వర్ట్ వర్సిటీలో ఎంబీఐ చదివి కొన్నాళ్లు వరల్డ్ బ్యాంకులో పనిచేశారు. 2011లో జూబ్లీహిల్స్ కేంద్రంగా క్రియా హెల్త్‌కేర్ సంస్థను నెలకొల్పి ఏపీలో అర్బన్ హెల్త్‌కేర్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణ, ఎమర్జెన్సీ సేవలు, అంబులెన్స్‌ల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపట్టారు. సంస్థలో వేణుమాధవ్ వాటాగా ఉన్న 60 శాతం షేర్లను తమకు అమ్మేయాలని మిగతా డైరెక్టర్లు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో డైరెక్టర్ల మధ్య వివాదం ముదిరి పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబర్‌లో ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు.. ఆ బాధ్యతలను అప్పటి టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లుకు అప్పగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాధాకిషన్‌రావు, గట్టుమల్లు, మల్లికార్జున్, కృష్ణారావు, గోపాల్, రాజ్, రవి, బాలాజీతోపాటు ఇతర వ్యక్తులపై ఐపీసీ 386, 365, 341, 120 (బీ) రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులోప్రత్యేక పీపీగా సాంబశివారెడ్డి
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సాంబశివారెడ్డి నియమిస్తూ తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వు జారీ చేసింది.