నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 13: యాసంగి ధాన్యం సేకరణపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులకు వెన్నుచూపినా చివరి వడ్ల గింజ వరకు కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇవ్వడంతో కర్షకలోకం సంబురపడుతున్నది. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించినందుకు సీఎం చిత్రపటాలకు క్షీర, ధాన్యాభిషేకాలతో కృతజ్ఞతలు తెలిపింది. వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డి భారీ కటౌట్లకు క్రేన్ సాయంతో పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్‌లో రైతులు కేసీఆర్ చిత్రపటానికి ధాన్యాభిషేకం చేశారు. బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్‌లో ఓ రైతు.. సీఎం కేసీఆర్ ఫొటోతో వడ్లు తూకం వేసి కృతజ్ఞతలు తెలిపాడు. రాష్ట్ర రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు వనపర్తికి చెందిన టీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ప్లకార్డులు చేతబూని సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.