యాదగిరిగుట్ట, జూలై 6: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను ఎందుకు పునరుద్ధరించలేదో రైతులకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం 12 నెలల్లో పనిని పూర్తి చేసి, ఎందుకు గోదావరి జలాలు విడుదల చేయడంలేదో చెప్పాలన్నారు. సోమవారం ఆమె ఓ ప్రకటన విడదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరగలేదని తేలిందన్నారు. అవినీతి ఎట్లా జరుగుతుందో అవినీతి చేసే రేవంత్‌రెడ్డికే తెలియాలన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు వస్తే రైతులు అల్లాడిపోతారన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్దకు వెళ్లారన్నారు. కన్నెపల్లి నీటి మట్టం 97.4 అడుగులుగా ఉందని, 93 అడుగుల నీళ్లు ఉన్నా కిందికి వదులుకునే అవకాశం ఉందన్నారు. రోజూ 2 టీఎంసీల నీటిని లిప్టు చేసి కిందికి తీసుకునే అవకాశం ఉందని, దాదాపుగా 40 లక్షల ఎకరాలకు సాగనీరు అందించవచ్చునన్నారు.
బీఆర్ఎస్ చెప్పివన్నీ చేసుకుం టూ పోతే కేసీఆర్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదన్నారు. కేటీఆర్ రావడంవల్లే నీటిని విడుదల చేశారన్న ప్రచారం జరుగుతుందని రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి భయపడుతున్నారన్నారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కు రావడం అదృష్టమని, దేశానికి అన్నం పెట్టే రైతుకు సాయం చేసే శాఖ మీ చేతిలో ఉన్నందున పంతాలకు వెళ్లకుండా కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లను ఆన్‌చేసి కిందికి నీటిని విడుదల చేయాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.