సంప్రదాయ సాగు పద్ధతుల నుంచి ఆధునిక వ్యవసాయం వైపు మళ్లుతున్నాడు అన్నదాత. ఇటీవల కాలంలో పల్లెల్లో నూతన వ్యవసాయం, యంత్రాల వినియోగం వినియోగం అమాంతం పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గ్రామాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా మల్చింగ్, డ్రిప్, పాలిహౌస్‌ల వంటివి అధికంగా కన్పిస్తున్నాయి. ఇంకోవైపు సాగు పద్ధత్లోనూ అనేక మార్పులు వచ్చాయి. విత్తనాలు విత్తే దగ్గర నుంచి నాట్లు వేయడం, కోతలు కోయడం, నూర్పిడి చేయడం వంటి అన్ని పనుల్లోనూ యంత్రాల వినియోగమే తప్ప మానవ ప్రమేయం లేకుండా పోయింది. ఇంకోవైపు వాణిజ్య పంటల వైపు అమితమైన మక్కువ పెరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ‘దళితబంధు’ పథకం కింద అందించిన హార్వెస్టర్లు సహా వ్యవసాయ యంత్రాలన్నీ స్థానికంగా గ్రామాల్లోనే లభ్యమవుతుండడంతో సాగు పనుల్లో చాలా వరకూ యంత్రాల వినియోగం గణనీయంగా పెరిగింది.
కూసుమంచి, జనవరి 23: ‘మా తాతలు ఆ పంటే వేశారు. మేమూ అదే పంట వేస్తున్నాం.’ అనే రోజులు కనుమరుగయ్యాయి. సాగునీటి వనరుల లభ్యత దగ్గర నుంచి విద్యుత్ సరఫరా, భూగర్భజలాల పెంపు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు, రైతుబంధు పంటల పెట్టుబడి సాయాలు, మద్దతు ధరల వంటివన్నీ ఉమ్మడి జిల్లాలో సాగు పద్ధతులను సమూలంగా మార్చివేశాయి. ఒకనాడు పొలం దున్నాలంటే ఎద్దులు, నాగళ్లు అవసరమయ్యేవి. విత్తనాలు విత్తాలన్నా, నాట్లు వేయాలన్నా, కోతలు కోయాలన్నా, తూర్పార పట్టాలన్నీ కూలీలే చేయాల్సి వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్నదాతలందరికీ సబ్సిడీలపై యంత్ర పరికాలు, సమకూర్చడం, హలధారులందరూ వాటిని అందిపుచ్చుకోవడంతో ఎవుసంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. సాగు పద్ధతులు ఆధునికత వైపు మళ్లాయి.
అన్నదాతలు వ్వవసాయంతోపాటు అదనపు ఆదాయం చేకూరే మార్గాలనూ అన్వేషించారు. ముఖ్యంగా పాడి పరిశ్రమను ముఖ్యమైన ఆదాయ వనరుగా మలుచుకున్నారు. పంట చేలల్లో సాగుకు అనుబంధంగా కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటలు వంటివి పెంచుతున్నారు. మరోవైపు పెరటి కోళ్లు, గొర్రె పిల్లలు, చేపల చెరువుల వైపూ మొగ్గు చూపుతున్నారు.
గతంలో పండించిన పంటలకు భిన్నంగా రైతులు అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. కూలీల సంఖ్య తగ్గిపోవడంతో యంత్ర పరికరాల వినియోగాన్ని అమాంతం పెంచారు. ట్రాక్టర్లు, కుబోటోలు, ట్రాలీలు, వరి కోత మెషీన్లు, నూర్పిడి యంత్రాలను చెంత ఉంచుకుంటున్నారు. సొంతంగా కొనుగోలు చేయలేని రైతులు అద్దె చెల్లించి వినియోగించుకుంటున్నారు.వ్యవసాయాన్ని సులభతరం చేసుకుంటున్నారు.
గతంలో పాలీహౌస్ అంటే తెలిసేది కాదు. దీంతో దాని గురించి తెలుసుకొని మరీ దానిని ఏర్పాటు చేసుకున్నాం. పాలీహౌస్ చాలా బాగుంది. ఇందులో నిరుడు కాప్సికం సాగు చేశాను. మంచి దిగుబడి వచ్చింది. ఈ సారి టమాటా వేశాను. మంచి లాభమే వచ్చింది. 20 గంటల్లో పాలీహౌస్ ఏర్పాటు చేశా. ఎండలకు, వానలకు పంటలు తట్టుకొని మంచి దిగుబడిని అందిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఒకకప్పుడు వర్షాధార పంటలు పండించే వాళ్లం. కానీ ఇప్పుడు అందరమూ వరితోపాటు మిర్చి, కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తున్నాం. పాలీహౌస్‌కు రూ.13 లక్షల ఖర్చు వచ్చింది. ఖర్చుతో కూడుకున్నప్పటికీ లాభాలూ మంచిగానే వస్తున్నాయి.
-నలమల కృష్ణయ్య, రైతు, గోపాల్రావుపేట
పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులను అమితంగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో మిర్చి, కూరగాయలు, పూల తోటల సాగును అధికంగా పెంచారు. ప్రధానంగా సూక్ష్మబిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), మల్చింగ్ వంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్లు మాత్రమే మల్చింగ్ను, పాలీహౌస్ను వినియోగించే వారు. కానీ ఇప్పుడు గ్రామాల్లోని చిన్న చిన్న రైతులూ వీటిని వినియోగిస్తున్నారు. రైతులంతా ఇలా కొత్త ఆలోచనలో వ్యవసాయం చేయడం చాలా మంచి పరిణామం. వరి, మిర్చి వంటి సాధారణ పంటలు కాకుండా పూలతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, పామాయిల్ వంటివి కూడా సాగు చేస్తున్నారు.
-రామడుగు వాణి, ఏవో, కూసుమంచి
గతంతో కాలువలు తీసి నీరు పెట్టి చాలా ఇబ్బందులు పడే వాళ్లం. కానీ ఇప్పుడు కాలువలతో ఇబ్బందులు లేకుండా పోయాయి. డ్రిప్ ఇరిగేషన్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల సాగు నీళ్లు వృథా అయ్యే అవకాశం లేదు. డ్రిప్ నీళ్లన్నీ నేరుగా మొక్క మొదట్లోనే పడుతుండడంతో పంట కూడా మంచి చేతికొస్తోంది. డ్రిప్ పైపులను వేసవిలో దాచి ఉంచుతాం. తొలకరి రాగానే మళ్లీ తీసుకొచ్చి వినియోగిస్తాం. సాధ్యమైనంత వరకు బొప్పాయి, కూరగాయల వంటి పంటల సాగుకే ఎక్కువగా వినియోగిస్తాం. నేను గత సంవత్సరం నుంచి మిర్చి తోటలకు డ్రిప్‌తోనే నీళ్లు పెడుతున్నాను.
-ముల్కూరి శ్యాంసుందర్‌రెడ్డి, కూసుమంచి