టెహ్రాన్, ఆగస్టు 1: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై శత్రుదేశాలు దాడికి దిగే అవకాశం ఉంది. తమ సొంత గడ్డపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను హత్య చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయండి అంటూ ఆదేశించినట్టు ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. హనియా మరణానంతరం బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్‌పై దాడి చేయాలంటూ ఆ సమావేశంలో ఖమేనీ మిలటరీకి ఆదేశాలు ఇచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ‘ప్రతీకారం మా విధి. వారి కోసం కఠినమైన శిక్షను సిద్ధం చేశాం’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇరాన్ ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఏప్రిల్‌లో సిరియాలో ఇద్దరు ఇరాన్ మిలటరీ కమాండర్లను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హతమార్చినప్పుడు కూడా ఇదే తరహా సమావేశాన్ని నిర్వహించారు.
ఎవరు.. ఎవరి పక్షాన?
ఒకవేళ ఇరాన్ కనుక ఇజ్రాయెల్‌పై దాడికి దిగితే ఎవరు ఎవరికి మద్దతు ప్రకటిస్తారు అన్న విషయాన్ని పరిశీలిస్తే ఇరాన్ దళాలకు హమాస్, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని మిలీషియా గ్రూపులు మద్దతుగా రానున్నాయి. అదే సమయంలో ఇప్పటికే పటిష్టమైన శత్రు దాడి నిరోధ దుర్భేద్య వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్‌కు సహాయంగా అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో అండగా నిలుస్తుందని భావిస్తున్నారు.