తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విషం చిమ్మారు. తెలంగాణలో చేపడుతున్న పలు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాసింది. అక్టోబర్ 1న జరగనున్న కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చి చర్చించాలని కోరింది.
ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డితోపాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యం తగ్గింపు, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు అంశాలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు సమాచారం.
అలాగే పులిచింతల బ్యాక్‌వాటర్‌పై ప్రతిపాదించిన రాజీవ్‌గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండా ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలను కూడా అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలను ఏపీ, తెలంగాణ మధ్య 512:299 నిష్పత్తిలో పంచేలా ఆదేశాలు జారీ చేయాలని కేఆర్ఎంబీని ఏపీ ప్రభుత్వం కోరింది. 2015లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన అవగాహనలో 811 టీఎంసీలను ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలుగా పంచుకునే అంశం నమోదైంది.