మెదక్, మార్చి 2 : సీఎం కేసీఆర్ ఈ నెల 8న శ్రీకారం చుట్టనున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్య ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన మన ఊరు- మన బడి పథకంపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఈ పథకం అమలుకు మెదక్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో పాఠశాలలను బంగారు పాఠశాలలుగా తయారవుతాయని పేర్కొన్నారు.
మూడేళ్లలో వరకు ఈ పథకం పూర్తవుతుందని, అనంతరం అన్ని రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటాయని తెలిపారు. మన ఊరు-మనబడి పథకాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.