ఖిలావరంగల్ జనవరి 14 : రైలు(Train) ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి భారత సైన్యంలో సుబేదార్గా (Army Subedar) పనిచేస్తున్న ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్ (48) పంజాబ్లోని అమృత్సర్లో ఇండియన్ ఆర్మీ సుబేదార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆయన న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే అండమాన్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం. 16032)లో ప్రయాణిస్తున్నారు.
అదే రోజు రాత్రి 10:40 గంటల సమయంలో రైలు కేసముద్రం – ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్యకు రాగానే సంతోష్ కుమార్ ప్రమాదవశాత్తు రైలు నుండి కిందకు జారిపడ్డారు. ఈ ప్రమాదంలోఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్ రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుని వద్ద లభించిన ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసి, మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.